నల్లమల అడవుల్లోని అమ్రాబాద్, ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలోని కవ్వాల్ పెద్దపులుల అభయారణ్యాల్లోకి పర్యాటకుల్ని అనుమతించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబరు 1 నుంచి సఫారీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
కరోనా నేపథ్యంలో ఏడు నెలల క్రితం అధికారులు అడవుల్లోకి సందర్శకుల అనుమతిని నిలిపివేశారు. అన్‌లాక్ మార్గదర్శకాల నేపథ్యంలో పలు పర్యాటక ప్రాంతాలు తెరచుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్రం అనుమతి మేరకు నాలుగు వారాల క్రితం అటవీ శాఖ పట్టణ అటవీ పార్కులనూ, జూపార్క్‌లనూ తెరిచింది. అలాగే ఆ శాఖ అధికారులు అటవీ ప్రాంతాల్లోని అభయారణ్యాల్లోకి పర్యాటకులకు అనుమతి ఇస్తున్నారు. ఆదివారం నుంచి సఫారీని ప్రారంభించనుంది.
అదే విధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆలయాలకు రాకపోకలు సాగించే మార్గాల్లో వాహనాల నుంచి రూ. 50 చొప్పున ప్రవేశ రుసుం వసూలుచేయాలని అటవీశాఖ నిర్ణయించింది. అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం శ్రీశైలం మార్గంలో మన్ననూరు చెక్‌పోస్టు వద్ద ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారు.