అఖిల భారత కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు... రాష్ట్రంలో రైతులు, వామపక్ష నేతలు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగానిరసన వ్యక్తం చేశారు. సాగు చట్టాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.
వారిని విడుదల చేయాలి
హైదరాబాద్ హయత్‌నగర్ డిపో నుంచి బస్టాండ్ వరకు రైతులు ఎడ్ల బండితో ప్రదర్శన చేపట్టారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని... అవి కేవలం కార్పొరేట్ సంస్థల కోసమే తీసుకొచ్చిన చట్టాలని విమర్శించారు. దిల్లీలో అరెస్టు చేసిన రైతు నేతలను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు.
పోరాటం ఆగదు
హైదరాబాద్లోని నల్గొండ క్రాస్ రోడ్డులో రైతు సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. నూతన సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. దిల్లీ సరిహద్దుల్లో పోరాటాన్ని అణచివేయాలని కేంద్రం చూస్తున్న తరుణంలో... దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం మరింత బలపడుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేసే వరకు ఈ పోరాటం సాగుతుందని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
రహదారిపై కూరగాయలు పోసి
ఇబ్రహీంపట్నంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. అన్నదాతలకు సంఘీభావంగా నిరసన చేపట్టారు. సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమానికి మద్దతుగా ఖమ్మం జిల్లాలో రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. తిరుమలాయపాలెం మండలం పిండిపోలులో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఖమ్మం-వరంగల్ రహదారిపై కూరగాయలు పోసి రైతులు నిరసన తెలిపారు. 2 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి.
రోడ్డుపై బైఠాయించి
రైతు ఉద్యమానికి సంఘీభావంగా సూర్యాపేట జిల్లా కోదాడలో రైతులు ధర్నా చేపట్టారు. జాతీయరహదారిని దిగ్బంధించారు. హైదరాబాద్-విజయవాడ రహదారిపై 2 కి.మీ. మేర వాహనాలు నిలిచాయి. సూర్యాపేట వద్ద జాతీయ రహదారిని అన్నదాతలు దిగ్బంధించారు. నల్గొండ జిల్లాలో రైతు ఆందోళనలకు సంఘీభావంగా ధర్నాలు నిర్వహించారు. చర్లపల్లి వద్ద వామపక్షాలు, దామరచర్ల వద్ద కాంగ్రెస్ శ్రేణులు రహదారిని దిగ్బంధించాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై బైఠాయించి అన్నదాతలకు మద్దతు పలికారు.
ఇదీ చదవండి : దిల్లీ సరిహద్దుల్లో 50 వేల మంది బలగాల మోహరింపు