రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రెండు రోజులు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో రాబోవు వర్షాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసిన సీఎస్ సోమేశ్ కుమార్... రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా అధిక వర్షాల కారణంగా వరదలు రావడం, నీటి నిల్వలు అధికం కావడం లాంటివి జరిగే ప్రమాదం ఉందని... లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ట్రాఫిక్ స్తంభించి వాహన రాకపోకలకు అంతరాం ఏర్పడి ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సీఎస్ పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు జిల్లాల పాలనాయంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రోటోకాల్ పాటించాలి
గతంలో ఇచ్చిన వరద ప్రోటోకాల్‌ను కచ్చితంగా అధికారులు పాటించాలని, తక్కువ ఎత్తున్న వంతెనలు, కాజ్‌వేలు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున... అక్కడ వాహనరాకపోకలను, పాదచారుల కదలికలను నిషేధించి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లాలల్లో వర్షాల కారణంగా సంభవించే ఏలాంటి అవాంఛనీయ ఘటనలనైనా... ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : రెండ్రోజులు వానలున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి : కేసీఆర్