టీఎస్బీపాస్తో సహా 8 బిల్లులకు ఒకేరోజు శాసనమండలి ఆమోదం తెలిపింది. గత ఏడాది మార్చి నుంచి ఆగస్టు తో పోల్చితే... ఈ ఏడాది ఇదే మాసాల్లో రూ.7,851 కోట్ల ఆదాయం తక్కువగా వచ్చినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ విపత్తు-ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి సవరణ బిల్లును, కోశ బాధ్యత - బడ్జెట్ నిర్వహణ బిల్లు, ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ సవరణ బిల్లులను శాసన మండలిలో మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు.
ఆ విషయంలో రెండో స్థానం
కరోనాతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ఈ ఐదునెలల్లో రూ.55,638 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టామని ఆయన వివరించారు. ఎఫ్ఆర్బీఎం 2 నుంచి 5 శాతం తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో అందుకు ప్రభుత్వం మొగ్గు చూపిందన్నారు. అప్పు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం కింద నుంచి రెండో స్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు అప్పులు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు.. తిరిగి వాటితో ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ బిల్లు బ్రహ్మాస్త్రం
టీఎస్ బీపాస్ బిల్లు నిరుపేదలకు బ్రహ్మాస్త్రం అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇల్లు కట్టాలంటే అనేక అవస్థలు పడేవారని... కానీ ఈ బిల్లు తర్వాత అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావన్నారు. 75 గజాల లోపు అనుమతులు అవసరం లేదని.. అయితే సెట్ బ్యాక్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని లేకుంటే నోటీసు ఇవ్వకుండా కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. దరఖాస్తు చేసిన 21 రోజుల్లో 12 శాఖలతో సమన్వయం చేసుకుని అనుమతులు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లే అవుట్ అతిక్రమించి నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని ఆయన సూచించారు.
త్వరలోనే నియామకాలు
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నర్సీరెడ్డి, జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో వీసీల నియామకం, ఖాళీలు భర్తీ చేయకుండా ప్రైవేట్ వర్సిటీల బిల్లు తేవడం ఏంటని ప్రశ్నించారు. వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశామని త్వరలోనే నియామకాలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలపై ప్రభుత్వ అజమాయిషీ ఉంటుందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ ఎఫెక్ట్... అసెంబ్లీ సమావేశాలు మధ్యంతరంగా ముగించే అవకాశం