కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సీసీఎంబీ, సీడీఎఫ్‌డీకి అనుమతిచ్చిందని గుర్తు చేసింది. ప్రతి రోజు వెయ్యి పరీక్షలు చేయగలిగే సామర్థ్యం ఉన్నా... కిట్లు ఇవ్వకపోతే పరీక్షలు ఏలా చేస్తారని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ప్రశ్నించారు.
వైరస్ వ్యాప్తి నివారణకు అధికారులు రోడ్డు మ్యాప్ సిద్దం చేసుకోవాలని సూచించారు. అనుమానితుల గుర్తింపు, వేరుచేయుట, చికిత్స అందించడం, నిర్బంధించినవారి పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థలు ఉండేలా చూడాలన్నారు. నిత్యావసర సరుకులను కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో మౌలికవసతులు మెరుగుపరచాలని కోరారు. వైరస్ గొలుసుకట్టును విచ్ఛిన్నం చేయడానికి లాక్‌డౌన్ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు.
ఇదీ చదవండి: అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం