శాసనసభ సమావేశాలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఉంటుంది. ఆదివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 11, 12 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది. 13 నుంచి 19 వరకు బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది.
బిల్లులు, సీఏఏపై తీర్మానం
ఈ నెల 20న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం ఉంటుందని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. అక్బరుద్దీన్, భట్టి విక్రమార్క లఘు చర్చలు పెట్టాలని కోరగా... అందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. ఈ సమావేశాల్లో కొన్ని బిల్లులను కూడా ప్రవేశపెడతామన్న సర్కారు... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సభలో తీర్మానం చేస్తామని బీఏసీలో పేర్కొంది.
ఎన్నిరోజులైన సిద్ధం
కరోనాపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలు తొలగించేందుకు శాసనసభలో చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. రైతు సమస్యలు, ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై సభలో చర్చించాల్సి ఉందని... సమావేశాలు పొడిగించాలని కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క, మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. నిర్మాణాత్మక చర్చలు జరిగితే శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులైనా జరపడానికి సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
మరోసారి సమావేశం!
ఈ నెల 20 వరకు ప్రస్తుత ఎజెండా కొనసాగిద్దామని... మరోమారు బీఏసీ సమావేశమై... అవసరమైతే సమావేశాలు పొడిగించే అంశాన్ని పరిశీలిద్దామని ప్రభుత్వం తెలిపింది. లఘుప్రశ్నలతోపాటు 304 నిబంధన కింద ప్రతిపక్ష సభ్యులు కోరితే ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు. ఆయా అంశాలను ముందుగా అందిస్తే అవసరమైన సమాచారాన్ని శాఖల ద్వారా తెప్పించి సభలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు