కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్న తెలంగాణ విమోచన సభను విజయవంతం చేయాలని... భాజపా తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిశ్చయించింది. సెప్టెంబర్ 17న నిర్మల్‌లో జరగనున్న ఈ సభకు లక్షల సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ప్రజా సంగ్రామ యాత్ర శనివారం 15వ రోజుకు చేరుకున్న సందర్భంగా... సంగారెడ్డి జిల్లా జోగిపేటలో భాజపా తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రజా సంగ్రామ యాత్ర, సెప్టెంబర్ 17న నిర్మల్ లో నిర్వహించనున్న సభ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించనున్న సేవా కార్యక్రమాలు, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలపై చర్చించారు. నిర్మల్ సభను లక్షలాది మందితో నిర్వహించి.. రాష్ట్రంలో అధికార తెరాసకు అసలైన ప్రత్యామ్నాయం భాజపాయే అన్న స్పష్టమైన సందేశం ప్రజలకు చేరవేయాలని సమావేశం నిర్ణయించింది. ఇక బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగడంపై పార్టీ అగ్రనాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇకముందూ ఈ యాత్ర విజయవంతంగా కొనసాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అక్టోబర్ 7 వరకు వివిధ కార్యక్రమాలు..
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి... 20 వసంతాలు పూర్తి చేసుకుంటోన్న అక్టోబర్ 7 వరకు రాష్ట్ర పార్టీ, నాయకులు, కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తలపెట్టారు. మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ చర్యలు... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగించమని ప్రతిజ్ఞ, వైద్య శిబిరాలు, వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
హుజూరాబాద్‌లో విజయం ఖాయం..
హుజూరాబాద్ ఎన్నికలు ఎప్పుడొచ్చిన భాజపా అభ్యర్థి అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం ఖాయమని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సహా పార్టీ శ్రేణులు హుజూరాబాద్ వెళ్లి భాజపా విజయానికి కృషి చేయాలని నిర్ణయించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా ఇక్కడ భాజపా విజయాన్ని అడ్డుకోలేరని రాష్ట్ర పదాధికారుల సమావేశం స్పష్టం చేసింది.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో... కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే.అరుణ, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కే. లక్ష్మణ్, ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కుమారి బంగారు శృతి ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: Tharun chug: తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: తరుణ్ చుగ్