కేంద్రం తీసుకునే నిర్ణయాలు.. ప్రజలకు ఇబ్బందులు కలిగించేవిగా ఉంటే.. జాతీయ స్థాయిలో విపక్ష పాత్ర పోషించే పార్టీలు పెద్ద ఎత్తున స్పందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. కానీ.. ప్రస్తుతం ఈ పాత్ర పోషించేందుకు ఏ పార్టీలు కృషి చేయడం లేదని తెలిపారు. జాతీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు పోషించే పాత్రలో లోటు ఏర్పడితే.. ఆ లోటును సమాజమే పూడుస్తుందని చరిత్ర చెప్పిందని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆ లోటు.. ఓ కవిత ద్వారానో.. ఓ పాట వల్లనో.. లేక సినిమా ద్వారా అయినా పూడ్చుతుందని వివరించారు.
రైతు సమస్యలు, అన్నదాతకు జరుగుతున్న అన్యాయం.. కర్షకుడు పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణూర్తి నటిస్తూ.. నిర్మించిన చిత్రమే రైతన్న అని నిరంజ్ రెడ్డి(Minister Niranjan Reddy) తెలిపారు. అన్నదాత బాధలు చెప్పడమే కాదు.. వాటికి పరిష్కారం చూపేలా ఈ సినిమా ఉందని అన్నారు.
" ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఈ చిత్రం ప్రజల మదిలో చిరకాలం నిలిచిపోతుంది. ప్రజాప్రయోజనం కోసం తీసిన మూవీ ఇది. ఇందులో నిర్మాత ఆశించింది ఏం లేదు. రైతుల కోసం.. ఓ రైతు పక్షపాతి తీసిన చిత్రం. తెలుగు చలనచిత్ర రంగంలో ఆర్.నారాయణమూర్తి.. ప్రజలు, రైతుల బాధలు.. వాటికి పరిష్కారాలను చూపేటువంటి ఎన్నో సినిమాలు తీశారు. ఆయన తీసిన.. నటించిన ప్రతిచిత్రం.. సమాజహితంగానే ఉంటుంది. 'రైతన్న' సినిమాను నిర్మించడానికి ఆర్.నారాయణమూర్తి చాలా కష్టపడ్డారు. "
- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
రైతు ఆత్మహత్యలు.. గిట్టుబాటు ధర.. డా.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు వంటి పలు కీలక అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించినట్లు వెల్లడించారు. అందరిలో ఆలోచన రేకెత్తించే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీని ప్రజలంతా వీక్షించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.