రాష్ట్రంలో గత 20 రోజుల్లో రెట్టింపు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు... హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. పరీక్షల నిర్వహణ, వైద్యుల రక్షణపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై హైకోర్టు ఆదేశాల మేరకు... ప్రభుత్వం ఈ నివేదిక సమర్పించింది. ఈ నెల 15 వరకు 2.08 లక్షల శాంపిళ్లు పరీక్షించగా... 33 శాతం పాజిటివ్‌గా వచ్చాయని, 66 శాతం డిశ్చార్జ్ అయ్యారని, మరణాలు 1 శాతం ఉన్నాయని తెలిపింది. గత 20 రోజుల్లోనే 1.37 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
గతంలో 10 లక్షల జనాభాకు... 2వేల 515 మంది ఉండగా, ప్రస్తుతం 5వేల 961 పరీక్షలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 300 హెల్త్ సెంటర్లు, జిల్లాల్లో 870 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో... జులై 10 నుంచి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్‌లు అందుబాటులోకి రావడం వల్ల మొబైల్ ల్యాబ్‌లు అవసరం రాదని తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ మొబైల్ ల్యాబ్‌ల నిర్వహణలో భద్రతాపరమైన ఇబ్బందులున్నట్టు పేర్కొంది.
13 ప్రభుత్వ, 23 ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు జరుగుతున్నాయని, గత 20 రోజుల్లో ప్రైవేటు ల్యాబ్‌లలో 53 వేల పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. కరోనా చికిత్సల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 9, జిల్లాల్లో 52 ఆసుపత్రులు గుర్తించినట్టు వివరించింది. కరోనా చికిత్సకు సంబంధించి గాంధీ ఆసుపత్రి అద్భుతంగా పనిచేస్తోందని, బెడ్‌ల సామర్ధ్యాన్ని వెయ్యి 1,200 నుంచి 1,890కు పెంచామని తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం... పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్ని కంటైన్మెంట్ జోన్‌లుగా ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం నివేదించింది.