Teenmar mallanna joins bjp: ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న భాజపా గూటికి చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆయనకు కాషాయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భాజపా ప్రాథమిక సభ్యత్వాన్ని తీన్మార్ మల్లన్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని తాను గతంలోనే చెప్పినట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. తాను తీసుకున్న భాజపా సభ్యత్వ రసీదును తాడుగా అభివర్ణించిన మల్లన్న.. ఆ తాడుతో.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితను తెలంగాణ అమరవీరుల స్తూపానికి కట్టేస్తామన్నారు.
భాజపాలో తీన్మార్ మల్లన్న చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న వ్యక్తి మల్లన్న అని అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
Bandi Sanjay on mallanna: విఠల్, మల్లన్న నిజమైన తెలంగాణ ఉద్యమకారులని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధనకు భిన్నంగా పాలన సాగుతోందని ఆరోపించిన సంజయ్.. భాజపా ద్వారానే ఆ పాలనను అంతమొందించవచ్చనే నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారులంతా భాజపాలో చేరారని సంజయ్ కోరారు.
తీన్మార్ మల్లన్న తెలంగాణలో ఒక ప్రశ్నించే గొంతుకని బండి సంజయ్ తెలిపారు. మల్లన్న భాజపాలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయ స్వార్థంతో మల్లన్న పార్టీలో చేరలేదని సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న చాలాకాలంగా పోరాడుతున్నట్లు సంజయ్ తెలిపారు. అందువల్లనే ఆయనపై అనేక కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో అనేక సందర్భాల్లో తీన్మార్ మల్లన్నకు భాజపా అండగా ఉందని బండి సంజయ్ గుర్తుచేశారు.
ఇదీచూడండి: vittal joined in bjp: నిజమైన ఉద్యమకారులకు భాజపాలోకి ఆహ్వానం: బండి సంజయ్