ఆంధ్రప్రదేశ్లో వైకాపా పాలనలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని ప్రతిపక్ష తెదేపా ఆరోపిస్తోంది. రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులు, మహిళా రైతుల కష్టాలకు మద్దతుగా 'రైతు కోసం' పేరిట నేటి నుంచి 3 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. 'మద్దతు ధర లేక, పెట్టుబడులు కోల్పోయి, అప్పులపాలైన రైతుల సమస్యలు, పంటల బీమా సకాలంలో చెల్లించకపోవడంతో కర్షకులకు రూ.వేల కోట్లలో నష్టం, ఏడు వరుస విపత్తుల్లో పైసా పరిహారం అందించకపోవడం, వ్యవసాయ మోటర్లకు విద్యుత్తు మీటర్లు పెట్టడం తదితర రైతు వ్యతిరేక చర్యల్ని ప్రతిఘటించడమే ఆందోళన ప్రధాన లక్ష్యం' అని తెదేపా ఓ ప్రకటనలో తెలిపింది.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా
రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతుకూలీల ఇళ్లకు తెదేపా నాయకులు వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారు. పార్టీ తరఫున వారికి భరోసా ఇవ్వడం, మనోధైర్యం చెబుతారు. మృతి చెందిన రైతుల జ్ఞాపకాలను(వాడిన ముల్లుగర్ర, పైపంచె, కండువా, చెప్పులు)సేకరిస్తారు.
రెండో రోజు రచ్చబండ
రెండో రోజైన మంగళవారం రైతులు, రైతుకూలీల సమస్యలపై ప్రతి నియోజకవర్గంలో ‘రచ్చబండ' కార్యక్రమం నిర్వహిస్తారు. విపత్తు పరిహారం అంచనాల తయారీ, రైతుల జాబితా పరిశీలించి అక్రమాలను ఎండగడతారు. నష్టపోయిన రైతులందరికీ పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ దక్కేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. కనీస మద్దతు ధర లభించక నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలిచి, వారికి భరోసా కల్పించి విద్యుత్ మోటర్లకు మీటర్ల బింగిపును వ్యతిరేకించే కార్యక్రమాన్ని చేపడతారు.
మూడో రోజు పాదయాత్రలు.. రైతు జ్ఞాపకాల అందజేత
బుధవారం రెవెన్యూ కార్యాలయాలు, వ్యవసాయాధికారి కార్యాలయాలకు పాదయాత్రలు చేస్తారు. ఆయా నియోజకవర్గాల్లో రైతులకు జరిగిన నష్టాలపై వినతి ప్రతాలు అందజేస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల నుంచి సేకరించిన జ్ఞాపకాలను అధికారులకు అందజేస్తారు.
ఇదీ చదవండి: మలిదశలోనూ మట్టిపై మమకారం వీడలేదు..