రాజధాని పేరుతో ఏపీలో జరుగుతున్న దోపిడీని తెదేపా అధినేత చంద్రబాబు బయటపెడతారనే ఆందోళనతోనే విశాఖలో ఆయన పర్యటనను వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. కేంద్రం జోక్యం తక్షణం జోక్యం చేసుకొని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమైన సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెదేపా శ్రేణుల నిరసనలు
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో నిరసన ప్రదర్శన చేసిన తెదేపా శ్రేణులు డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏడురోడ్ల కూడలి వద్ద నినాదాల మార్మోగాయి. విజయనగరం జిల్లాలోని ఎస్ కోట, గజపతి నగరం, నెల్లిమర్లలో రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తించారు. ఎస్ కోటలో విశాఖ – అరకు రోడ్డుపై తెదేపా కార్యకర్తలు బైఠాయించగా ట్రాఫిక్ స్తంభించింది. భారీగా పోలీసుల మోహరింపుతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ వ్యవహార శైలి ప్రజాస్వామ్య విరుద్ధమని తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు విమర్శించారు.
ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరు..
చిత్తూరు జిల్లా కుప్పంలోని శాంతిపురంలో జాతీయ రహదారిపై గంటపాటు నిరసనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తిరుపతి పట్టణం తూర్పు పోలీసు స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణులు రహదారిపై బైఠాయించాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోమప్ప కూడలిలో ఆందోళన చేశారు. కిరాయి వ్యక్తులతో వ్యూహం ప్రకారమే చంద్రబాబుపై దాడి చేయించారని భూమా అఖిలప్రియ కర్నూలులో విమర్శించారు. నెల్లూరులో గాంధీబొమ్మ వరకూ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.
కొవ్వొత్తుల ప్రదర్శన
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. చిలకలూరిపేటలో రహదారిపై మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. విజయవాడలో గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ అధినేతకు హాని తలపెడితే చూస్తూ ఊరుకోబోమని విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో తెదేపా శ్రేణులు పేర్కొన్నాయి. జగ్గయ్యపేట మండలం అన్నవరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని డీజేపురంలో నిరసన ర్యాలీ చేశారు. రాజమహేంద్రవరంలో రాజా థియేటర్ వద్ద బైఠాయించి, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కాకినాడలోని ఇంద్రపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్ వద్ద తెదేపా శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసన తెలిపారు.