Chandrababu about Har Ghar Tiranga: ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశానికి ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆ యువశక్తిని వినియోగించుకుంటే... ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన అజాదీ కా అమృత్ మహోత్సవాలల్లో చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. 75 ఏళ్ల స్వతంత్ర్యాన్ని పూర్తి చేసుకున్న వేళ సంబురాల్లో భాగంగా నిర్వహిస్తోన్న హర్ ఘర్ తిరంగా అద్భుతమైన కార్యక్రమం అని బాబు కొనియాడారు. రాబోయే మూడు రోజులు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు.
"మహనీయుల త్యాగాలతోనే స్వతంత్రం సిద్దించింది. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ రాజీలేని పోరాటం చేశారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వారికి నివాళులు అర్పించాలి. స్వతంత్రం వచ్చిన తర్వాతే హరిత విప్లవం, క్షీర విప్లవం వచ్చింది. ఇప్పుడు ప్రపంచానికి తిండిపెట్టే స్థాయికి చేరుకున్నాం. దేశ ఆదాయాన్ని 8రెట్లు పెంచుకుని.. ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచాం. తెలుగు బిడ్డలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కర్ఫ్యూలు ఉండే హైదరాబాద్ నుంచి కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసే స్థాయికి చేరుకున్నాం. నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా నీటి కొరత తీరుతుంది. ఆర్థిక అసమానతలు లేని వ్యవస్థ రావాలి. అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం." - చంద్రబాబునాయుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు
ఇవీ చూడండి: