తెదేపా అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వటంపై ఆ పార్టీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. దిల్లీలో మాట్లాడిన ఎంపీ గల్లా జయదేవ్.. సీఐడీ పెట్టిన కేసులు కోర్టులో చెల్లవని స్పష్టం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పదం వేరేచోట ఉత్పన్నం కాదనే విషయాన్ని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లి వందకుపైగా కేసులు ఓడిందని ఎద్దేవా చేశారు.
రాజకీయ కక్ష సాధింపు..
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ఎంపీ కనకమేడల ఆరోపించారు. పాలనాపరమైన నిర్ణయంపై కేసులు పెడితే ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే వైకాపా ప్రభుత్వం చేసే భూసేకరణపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కుట్రకోణం ఉందని విమర్శించారు. కేసులతో బ్లాక్ మెయిల్ చేయడం అధికార దుర్వినియోగమేనని దుయ్యబట్టారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పక్కదోవ పట్టించేందుకే..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పక్కదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. తెదేపా ఉక్కు ఉద్యమం నడిపిస్తుందనే భయంతో కేసులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉక్కు ఉద్యమాన్ని వైకాపా ముందుకు తీసుకెళ్లినా మద్దతిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం... మూడు షిఫ్టుల్లో కౌంటింగ్...'