ఏపీలోని కృష్ణా జిల్లా అయినంపూడి గ్రామంలో వెనకబడిన వర్గానికి చెందిన మహిళకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు తెదేపా ఆధ్వర్యంలో ఛలో అయినంపూడి కార్యక్రమం చేపట్టామని తెదేపానేత వర్ల రామయ్య తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు వస్తున్న తమ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పోలీసులు అరెస్టు చేసినా తాము ఛలో అయినంపూడి కార్యక్రమం చేపట్టి తీరుతామని బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. బాధితుల తరుఫున నిలబడాల్సిన పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అయినంపూడి గ్రామంలోని దళిత మహిళ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ... జిల్లా పార్టీ ఆదేశాలు మేరకు ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి అయినంపూడి వెళ్తుండగా కంచికచర్ల, వీరులపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులను... దోనబండ జాతీయ రహదారిపై చెక్‌పోస్ట్ వద్ద రూరల్ సీఐ సతీశ్, కంచికచర్ల ఎస్ఐ రంగనాథ్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు...
నర్సింగ్ విద్యార్థిని ప్రేమించానని వెంట తిరిగి చివరకు సాయి రెడ్డి పెళ్లి చేసుకోవాలంటే నిరాకరించి ఆమె కుటుంబంతో సహా నిద్రిస్తున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున ఆమె ఇంటికి నిప్పుఅంటించటాన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కేసు వెనక్కి తీసుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరించటం వైకాపా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని... దళితులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఇదే ఘటనపై నందిగామ మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య బయలుదేరి వెళ్లిన సమయంలో గొల్లపూడి వద్ద పోలీసులు అడ్డుకుని ఆమెను కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.