ఏపీ ప్రభుత్వ అండతోనే.. తెలుగుదేశం నాయకులపై వైకాపా వర్గీయులు దాడులకు తెగబడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. తెదేపా కార్యకర్తల హత్యలకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలన్నారు. తమ పార్టీ నాయకుల మీద దాడులు జరిగితే ఇక మీదట చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదగార్లపాడులో ఆదివారం రాత్రి దారుణహత్యకు గురైన తెదేపా నేత, మాజీసర్పంచ్ పురంశెట్టి అంకులు కుటుంబాన్ని లోకేశ్ మరామర్శించారు. ఆయన భార్య పున్నమ్మ, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. అంకులు మృతదేహం వద్ద నివాళులర్పించి.. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
జగన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా... ఇక్కడితో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టండి. పొరపాటున ఇంకో కార్యకర్త జోలికి వస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహిస్తారు. ఆంధ్రరాష్ట్రం ఇడుపులపాయ కాదు. ఆనాడు మేం తలుచుకుంటే.. మీరు పాదయాత్ర చేసేవారా..? ఒక్కసారి ఆలోచించండి. మా ఓపికను పరీక్షించొద్దు. మళ్లీ ఇంకోసారి దాడి జరిగితే ..తర్వాత జరిగే పరిణామాలకు మీరే కారణం అవుతారు. మా కార్యకర్తల మీద దాడి జరిగితే మేం పారిపోయే బ్యాచ్ కాదని జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.
- లోకేశ్ , తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఎమ్మెల్యే, ఎస్సైల పాత్ర ఉంది.
అంకులయ్య హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎస్సై బాలనాగిరెడ్డి హస్తం ఉండవచ్చని లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. అంకులయ్య ఫోన్ కాల్ లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హత్య జరగడానికి ముందు ఎస్సై.. అంకులయ్యను మాట్లాడాలని పిలిపించారని చెప్పారు. ఎస్సై పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలన్నారు.