Defamation: ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాత్రుడు పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఆరోపణలు మాధవ్ నిరూపించాలని డిమాండ్ చేస్తూ.. రూ. 50లక్షల మేర పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నోటీసులు పంపించారు. వారం రోజుల్లో తన నోటీసులకు సరైన స్పందన రాకుంటే.. న్యాయస్థానంలో తగు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చింతకాయల విజయ్ పాత్రుడు నోటీసు ద్వారా హెచ్చరించారు.
అసలేం జరిగిదంటే : వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి ఏపీలో గురువారం కలకలం రేపింది. ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ ఆ వీడియో నకిలీదని అన్నారు. తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇది తెదేపా నేతల కుట్ర అని ఆరోపించారు.
దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో తనది కాదని అన్నారు. ఆ వీడియోను చింతకాయల విజయ్ (అయ్యన్నపాత్రుడి కుమారుడు), పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు విడుదల చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై చింతకాయల విజయ్ పరువునష్టం దావా వేశారు. మరి, ఈ నోటీసులకు ఎంపీ గోరంట్ల మాధవ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవీ చదవండి : నదిలో చిక్కుకున్న వృద్ధ జంట.. తాళ్లతో కాపాడిన సహాయక సిబ్బంది