మాజీ మంత్రి, తెదేపా నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల... హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీకాళహస్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గోపాలకృష్ణారెడ్డి... చంద్రబాబు కేబినెట్‌లో మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. శ్రీకాళహస్తికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని ఊరందూరు గ్రామంలో ఆయన జన్మించారు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేశారు. 1972లో న్యాయపట్టా అందుకున్నారు. వివాహమైన తర్వాత లా ప్రాక్టీసు కోసం హైదరాబాద్ వచ్చిన బొజ్జల.. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1989లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1994-2004 మధ్య కాలంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ, రోడ్లు-భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర మొదటి మంత్రివర్గంలోనూ బొజ్జల చోటు దక్కించుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా ఉన్నారు. బొజ్జలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆప్తులుగా ఉండేవారు. కీలక సమయాల్లో పార్టీలో బొజ్జల, తుమ్మల, మండవ క్రీయాశీలక పాత్ర పోషించారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో బొజ్జల-గాలి ముద్దు కృష్ణమనాయుడిది మంచి జోడిగా చెప్పుకునేవారు. 2004-2014 మధ్య తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల - గాలి ముద్దుకృష్ణమ నాయుడును చిత్తూరు బ్రదర్స్ అంటూ పార్టీ నేతలు ఆత్మీయంగా పలకరించేవారు.
బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరణం పట్ల.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా హయాంలో తనతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ సహచరున్ని, ఆత్మీయ మిత్రున్ని కోల్పోయానని సీఎం విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జలను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బొజ్జల మరణం పట్ల ఆవేదన చెందిన సీఎం కేసీఆర్.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమని అన్నారు. లాయర్‌గా జీవితం ప్రారంభించి ఎన్టీఆర్ పిలుపుతో తెదేపాలో చేరారని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని చెప్పారు. బొజ్జల ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బొజ్జల మృతిపట్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని కోల్పోయానని అన్నారు.
ఇదీ చదవండి : ఖబడ్దార్... పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డా.. : శ్రీనివాస్ గౌడ్
పెళ్లి కోసం ప్రేయసి పక్కా ప్లాన్.. ప్రియుడి కండోమ్‌కు రంధ్రాలు.. చివరకు...