ఏపీలోని మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. దాడుల విషయంలో పోలీసులు, సీఎం జగన్ లాలూచీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రమేయంతోనే తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిగాయన్నారు. పార్టీ కార్యాలయం రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిదని.. పార్టీ కార్యాలయాలపై దాడులను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే తెదేపా కార్యాలయం ఉన్నా.. పోలీసులు పట్టించుకోలేదని.. దాడి జరిగితే నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రణాళిక ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు దాడులకు తెగపడ్డారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసే దాడి చేయించారని ధ్వజమెత్తారు.
ఈ దాడులు.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారా. చంద్రబాబు రేపు రాష్ట్ర బంద్ పాటిస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతోందని అందరూ చెప్పారు. ప్రజల పన్నుతో జీతం తీసుకునే డీజీపీ నేరస్థులతో లాలూచీ పడతారా ?. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం. రాష్ట్రంలో 356 అధికరణం ఎందుకు ప్రయోగించకూడదు ?.- చంద్రబాబు
ప్రజలంతా కలిసి రావాలి
ప్రజాస్వామ్యంపై దాడి చేసే శక్తులపై పోరాటం చేద్దామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలన్నారు. మీరు చేసే తప్పుడు పనులపై మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గృహ దిగ్బంధం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
కరెంటు ఛార్జీలను ఇష్టం వచ్చినట్లు పెంచుతారా ?. డ్రగ్ మాఫియాకు మీరు వత్తాసు పలుకుతారా ? రౌడీలతో రాజకీయాలు చేస్తారా? హెరాయిన్ గురించి మాట్లాడితే ఏం తప్పు? ఏపీలో గంజాయి సాగు ఉందని పక్క రాష్ట్రాల డీజీపీలు చెప్పారు. గంజాయి సాగు పెరిగిందని తెదేపా నేతలు అనడమే తప్పా? తాడేపల్లి ప్యాలస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దాడులు. దాడి విషయం తెలియకుంటే ఆ పదవికి డీజీపీ అర్హుడా? -చంద్రబాబు
ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదు..
దాడుల విషయమై.. ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదని చంద్రబాబు మండిపడ్డారు. సమావేశం ఉంది.. బిజీగా ఉన్నానని డీజీపీ చెప్పారన్నారు. గవర్నర్, కేంద్రమంత్రి ఫోన్ ఎత్తారు.. డీజీపీ ఎత్తరా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ఉపయోగించే అవసరం ఉందన్నారు. ఆర్టికల్ 356 ప్రయోగానికి ఈ దాడుల కంటే ఇంకేం కావాలని అన్నారు. కొందరు చేసే పనులతో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు. ఇన్నాళ్లూ తిట్టారు, జైలులో పెట్టారు.. ఇప్పుడు కొడతారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండున్నర ఏళ్లుగా మీ వేధింపులు చూస్తున్నామని ఆక్షేపించారు. మా ఇంటి గేటుకు తాళం వేసి మనోధైర్యం దెబ్బతీయాలని చూశారని.. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడులను ఖండించాలన్నారు. ఇది ప్రజలు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: