Tarun Chugh on Karimnagar CP: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ పరామర్శించారు. హైదరాబాద్ నాంపల్లి భాజపా కార్యాలయంలో బండి సంజయ్‌ను కలిసిన ఆయన.. గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించారు. అంతకు ముందు .. బండి సంజయ్ శంషాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి భారీ క్వానాయ్‌తో బయల్దేరారు. కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న బండి సంజయ్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
Tarun Chugh on Bandi Sanjay: భాజపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడి జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఆ ఘటనలో ఎంతో మంది నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే వరకు భాజపా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎన్ని రకాలుగా అడ్డుకున్నా.. ఇంకా ఎంత అరాచకంగా దాడులు చేసినా.. కాషాయ స్ఫూర్తికి భంగం కలిగించలేరని చెప్పారు.
తెలంగాణ పోలీసులు చాలా ధైర్యవంతులు. వాళ్లు.. నక్సల్స్, మావోయిస్టులను సులభంగా పట్టుకోగలరు. వారిని అంతం చేయగలరు. కానీ కొంతమంది మాత్రం తమ ఒంటిపై ఉన్నది ఖాకీ యూనిఫారమ్ అని మరిచిపోయి.. తెరాస కండువా కప్పుకున్నట్లు ప్రవర్తించారు. అది కరీంనగర్ భాజపా కార్యాలయం అనుకున్నారా లేక ఉగ్రవాద స్థావరం అనుకున్నారా? అందులో ఉంది జాతీయ పార్టీ ఎంపీ అని మరిచిపోయారా? ఒక ఉగ్రవాదిని ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు. మా కార్యాలయంపై దాడి.. జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించింది. ఇక్కడ జనరల్ డయ్యర్.. కరీంనగర్ సీపీ. అతన్ని వదిలే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో ఎంపీకే రక్షణ లేదు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా భాజపాను ఎదురించలేరు. బండి సంజయ్‌ను ఎవరూ.. ఆపలేరు. ఆయన పోరాట స్ఫూర్తిని ఎవరూ అడ్డుకోలేరు. మీరెన్ని దాడులు చేసినా.. జైల్లో పెట్టినా.. టైగర్ జిందా హై.. ఔర్ యే టైగర్ వాపస్ బీ ఆయా హై.
- తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
Bandi Sanjay Comments on CM KCR: భాజపా నాయకులకు కేసులు కొత్త కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఏం తప్పు చేశామని తమను అరెస్టు చేశారని ప్రశ్నించారు. ధర్మయుద్ధంతోనే కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. జీవో-317తో రాష్ట్రంలోని టీచర్లు, ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సకల జనుల సమ్మె చేసి రాష్ట్రం సాధించి కేసీఆర్‌ను సీఎం చేస్తే.. ఇవాళ ఆ ముఖ్యమంత్రే వాళ్ల పాలిట శాపమయ్యారని మండిపడ్డారు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడో వేరే జిల్లాల్లో ఇచ్చారని మనస్తాపానికి గురై గుండె పగిలి ఉద్యోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు భాజపా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేసీఆర్ సర్కార్ జీవో-317ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.
జైలుకి పంపితే బండి సంజయ్ భయపడతారని అనుకున్నారు. నాకు జైలు కొత్తేం కాదు. ఇప్పటి వరకు నేను 9 సార్లు జైలుకి వెళ్లొచ్చాను. మా కార్యకర్తలపై పోలీసులు దారుణంగా దాడి చేశారు. చాలా మంది కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సీ నాయకురాలు బొడిగె శోభ ఏం తప్పు చేశారు. మా నాన్న టీచరే. ఒక టీచర్ కొడుకుగా ఆ బాధేంటో నాకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి నేను అండగా ఉంటాను. జీవో - 317 రద్దు చేసే వరకు నా పోరాటం ఆగదు.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు