లాక్‌డౌన్ కారణంగా పేదలు, రోజూవారీ కార్మికులు, వలస శ్రామికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఉపాధి దొరక్క తిండి కోసం దిక్కులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కన్నీటి బాధలను చూసి చలించిపోయింది తమిళనాడులోని మధురైకి చెందిన నేత్ర.
కన్నీటి బాధలను చూసి...
ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని లాక్‌డౌన్ బాధితులకు తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అయితే తనది స్థితిమంతుల కుటుంబమేమీ కాదు. ఆమె తండ్రి మోహన్ మధురైలో ఓ సెలూన్ నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆ దుకాణం కూడా మూతపడడం వల్ల రెండు నెలలుగా వారి కుటుంబానికి కూడా ఎలాంటి ఆదాయం లేదు. అయితే తన ఉన్నత చదువుల కోసం తన తండ్రి పోగుచేసిన రూ.5లక్షల సొమ్ముతో పేదల ఆకలి తీరుద్దామని తండ్రిని కోరింది. చిన్న వయసులోనే కూతురి పెద్ద మనసును చూసి ఉప్పొంగిపోయాడా తండ్రి. తను కోరుకున్నట్లుగానే ఆ సొమ్ముతో మొత్తం 600 కుటుంబాలకు నెలకు సరిపడా బియ్యం, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకులను అందించి వారి ఆకలి తీర్చాడు.
మధురైకు మంచి పేరు తీసుకొచ్చారు...
సాయం చేసేందుకు స్థాయి అవసరం లేదని నేత్ర కుటుంబం మరోసారి నిరూపించింది. వీరి సేవా గుణం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లింది. ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ వీరి మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు. మధురైకు మంచి పేరు తీసుకొచ్చారని ఆ కుటుంబాన్ని కొనియాడారు.
ఐక్యరాజ్యసమితి సైతం గుర్తించింది...
తాజాగా నేత్ర ఔదార్యాన్ని ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. ఐరాస అభివృద్ధి, శాంతి విభాగం (యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ పీస్ - యూఎన్ఏడీఏపీ) నేత్రను ‘గుడ్‌విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’ (పేదల సద్భావనా రాయబారి)గా నియమించింది. దీంతో పాటు డిక్సన్ స్కాలర్‌షిప్ కింద రూ.లక్ష బహుమతి కూడా ప్రకటించింది.
జెనీవాలో ప్రసంగించనున్న నేత్ర...
గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులైన నేత్ర త్వరలో న్యూయార్క్లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్, జెనీవాలో నిర్వహించనున్న సివిల్ సొసైటీ ఫోరం కాన్ఫరెన్స్ సమావేశాల్లో ప్రసంగించనుంది. ‘వివిధ దేశాల అధిపతులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో పాటు సాధారణ ప్రజలు పేదలకు సాయం చేసేలా ప్రోత్సహించేందుకు ఆమె ప్రసంగం తోడ్పడనుంది’ అని యూఎన్ఏడీఏపీ ప్రతినిధి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అప్పుడు తాగేందుకు నీరు కూడా దొరకలేదు....
మాది రామానాథపురం జిల్లా. 20 ఏళ్ల క్రితం మదురైకి వచ్చి స్థిరపడ్డాం. ఏడేళ్ల క్రితం అనుకుంటా... మా నాన్న దాచుకున్న సొమ్మును కొందరు దుండగులు కాజేశారు. దీంతో మేం రోడ్డున పడ్డాం. ఆ సమయంలో కనీసం తాగేందుకు వాటర్ కొందామన్నా మా వద్ద డబ్బుల్లేవు. మళ్లీ నిదానంగా జీవితంలో స్థిరపడి నా ఉన్నత చదువుల కోసం మా నాన్న డబ్బు దాయడానికి ఏడేళ్లు పట్టింది. ఈ కష్టాలను అనుభవించాను కాబట్టే నేను ఈ సహాయం చేశాను. అంతే కానీ నలుగురిలో గుర్తింపు రావాలని మాత్రం కాదు. అయితే ఈ ప్రశంసలు, గుర్తింపులు పేదలకు సేవ చేయాలన్న నా సంకల్పానికి మరింత ప్రోత్సాహమందించాయి. జెనీవాలో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘పేదరికం’ పై ప్రసంగించబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది.
- నేత్ర, విద్యార్థిని
ఈ గౌరవం ఊహించలేదు...
మాది సాధారణ కుటుంబం. నా కూతురిని ఐఏఎస్ చదివిద్దామని ఈ డబ్బును పోగు చేశాను. కానీ కరోనా కారణంగా పేదలు ఎలాంటి అవస్థలు పడుతున్నారో కళ్లారా చూశాం. అదే సమయంలో నా కూతురు వారికి సహాయం చేద్దామని నాతో చెప్పింది. దీంతో మొత్తం రూ.5లక్షలతో వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను అందజేశాను. పేదలకు సహాయపడాలన్న నా కూతురి నిర్ణయం మాకింతటి గౌరవాన్ని, గుర్తింపును తెస్తుందని అసలు ఊహించలేదు.
-మోహన్, నేత్ర తండ్రి
నేత్ర చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే చూసుకుంటది...
ఈక్రమంలో నేత్ర చదువుకయ్యే ఖర్చంతా రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తుందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి తన చదువు నిమిత్తం దాచిన డబ్బుతో నిత్యావసరాలు పంపిణీ చేయడం ఎంతో హర్షణీయమని సీఎం పేర్కొన్నారు. ఈ చర్య ఇతరులకు చేసే సేవ పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత, నిస్వార్థాన్ని తెలియజేస్తోందన్నారు. ప్రోత్సహించిన ఆమె తండ్రికి కూడా పళనిస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
చిన్న వయసులో పెద్ద మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటోంది నేత్ర. తన సేవాగుణంతో అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకున్న ఈ చిన్నారికి మనమూ అభినందనలు తెలుపుదాం. ఆమె స్ఫూర్తితో మరికొందరు దాతలు లాక్‌డౌన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరుకుందాం.