SC on hyderabad journalists: హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు శుభవార్త వినిపించింది. ఇళ్ల స్థలాల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతోన్న హైదరాబాద్ జర్నలిస్టులకు.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ విరమణకు ఒక రోజు ముందు తీపికబురు అందించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు సుప్రీం పచ్చజెండా ఊపింది. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసుపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం విచారించింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. 8 వేల నుంచి 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటుకున్నట్టు తెలిపారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తూ తీర్పు వెలువరించారు. వారివారి స్థలాల్లో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో ధర్మాసనం ముందు లిస్టు చేయాలని తెలిపారు.
"ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నాం. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండి." - జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ
జర్నలిస్టులకు హైదరాబాదులో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంలో ఊరట లభించిన నేపథ్యంలో.. మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించిన సీజేఐకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన ప్రభుత్వ హామీ నెరవేర్చేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు వ్యక్తిగతంగా చొరవ చూపిన సీఎం కేసీఆర్కు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తీపి కబురు అని అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపులో కృషిచేసిన మంత్రి కేటీఆర్‌కు కూడా అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: