Dangeti Jahnavi: మా ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. అమ్మ పద్మశ్రీ, నాన్న శ్రీనివాస్ కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. దాంతో ఏడాది వయసు నుంచీ అమ్మమ్మ దగ్గరే పెరిగాను. అమ్మమ్మ చందమామను చూపించి కథలు చెబుతూ నాకు అన్నం తినిపించేది. అలాంటప్పుడు చందమామ నా వెంటే వస్తున్నట్టుగా అనిపించేది. ఆ పసితనంలో అమాయకంగా.. జాబిల్లి నా వెంటే ఉండాలంటే ఏం చేయాలని అడిగాను. చంద్రుడిపైకి వెళ్తే సరి అంది అమ్మమ్మ. ఆ మాటలు నా మనసులో గట్టిగా నాటుకున్నాయి. వయసుతోపాటు విజ్ఞానం పెరిగాక ఇంతవరకు ఎవరూ వెళ్లని అంగారకుడిపై అడుగుపెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నా.
పలు రకాల శిక్షణలు
పాలకొల్లులో పదో తరగతి, ఆదిత్య కళాశాలలో ఇంటర్ చదివాను. ఆ సమయంలో చిన్న అనారోగ్యం వల్ల 8.2 గ్రేడ్ పాయింట్లు మాత్రమే వచ్చాయి. దాంతో నాసాలో చేరడానికి అవకాశాలున్న బీటెక్ కళాశాల కోసం వెతకాల్సి వచ్చింది. చివరికి పంజాబ్‌లో ఉన్న ఎల్‌పీయూలో చేరాను. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపించడంతో 50 శాతం ఫీజు రాయితీ పొందాను. రెండో సంవత్సరంలో ఉండగా యూఎస్‌ఏలోని నాసా లాంచ్ ఆపరేషన్స్ కెనడీ స్పేస్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకు సంబంధించి ఎంపికలు జరుగుతున్నాయని విని దరఖాస్తు చేసుకున్నా. ఆ తర్వాత వాళ్లు ఆన్‌లైన్‌లో రెండు సార్లు ఇంటర్వ్యూలు చేసి నన్ను ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇరవై మంది ఈ శిక్షణకు ఎంపికైతే మనదేశం నుంచి నేను ఒక్కదాన్నే. అమ్మానాన్నలు కూడా భయపడకుండా నన్ను ప్రోత్సహించారు. లాక్‌డౌన్ కారణంగా ఈ శిక్షణ వాయిదా పడినా గత ఆగస్టులో మొదలైంది. ఇక్కడ వ్యోమగామి శిక్షణతోపాటు, అండర్ వాటర్ రాకెట్ లాంచింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ నడపడం వంటి వాటిల్లో శిక్షణ తీసుకున్నాను. దానిలో మేం ఒక మినీ రాకెట్‌ను కొన్ని కిలోమీటర్ల మేర పైకి పంపి సురక్షితంగా ల్యాండ్ చేశాం. ఇవన్నీ చేసిన తర్వాతే రోదసీలో ప్రయాణించాలన్న నా ఆలోచన బలపడింది.
అరుణ గ్రహమే లక్ష్యంగా...
రోదసీలోకి వెళ్లాలనుకునేవారికి అన్ని సబ్జెక్టులపైనా పట్టుండటంతో పాటు సముద్రంలో ఈదడం కూడా రావాలి. సముద్రగర్భంలో 35 అడుగుల లోతున ఒంటరిగా ఈతకొట్టే గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే రోదసీలో ఉండే గ్రావిటీనే ఇక్కడా ఉంటుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో మంచి కోచ్‌ల కోసం వెతికి ఒంటరిగా గోవా వెళ్లా. సముద్రగర్భంలో ఈదుతుండగా ‘లయన్ ఫిష్’ నాకు అతి సమీపంలోంచి వెళ్లింది. దాని ముల్లు ఏమాత్రం గుచ్చుకున్నా అచేతన స్థితికి చేరే ప్రమాదం ఉండేదని కోచ్ చెప్పారు. దాని నుంచి తప్పించుకున్నా జెల్లీ చేపల దాడి నుంచి తప్పించుకోలేకపోయాను. చికిత్స తీసుకుని బయటపడ్డాను అనుకోండి. కరాటేలోను గతంలో అంతర్జాతీయ స్థాయిలో రజతం సాధించాను. చిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం పొందాను. అమ్మాయిలకు పెళ్లొక్కటే చివరి లక్ష్యం కాకూడదు. అంతకుమించి చాలా చేయగలమనే విషయాన్ని గుర్తించాలి. సివిల్ పైలట్‌గా స్థిర పడాలనేది నా ఉద్దేశం.
-దంగేటి జాహ్నవి
ఇదీ చూడండి: Revanth Reddy: 'ఎన్ని నిర్బంధాలున్నా.. ఎర్రవల్లికి వెళ్లి తీరుతాం'