సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి స్టీఫెన్ రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో వీసీ.సజ్జనార్ ఆధ్వర్యంలో సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు చేపట్టారు.
తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత.. సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీపై దృష్టి సారిస్తానని చెప్పారు. రాష్ట్రంలోనే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు మంచి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో తనకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
1990 బ్యాచ్ అధికారి..
ప్రస్తుతం రాష్ట్రంలోని పశ్చిమ మండల ఐజీగా విధులు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర గతంలో హైదరాబాద్‌లో డీసీపీగాను పనిచేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర.. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో సమర్థవంతంగా పని చేసిన అధికారిగా గుర్తింపు ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత స్టీఫెన్ రవీంద్రను తెలంగాణకు కేటాయించారు. గత ఏడాది రాష్ట్రంలో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్‌గా ఉన్నారు.
ఇవీ చూడండి: PROMOTIONS: రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీపీ హోదా