ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి, విశాఖ ఉక్కు కార్మికులు దిల్లీ బయలుదేరారు. 170 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూర్మన్న పాలెం గేట్ వద్ద.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన చేస్తున్నారు. కేంద్రం స్పందించకపోవడంతో పార్లమెంటు ఉభయ సభలు జరుగుతున్న సమయంలో దిల్లీలో స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగను తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన
ఈ మేరకు దిల్లీ బయలు దేరిన కార్మికులు రేపు జంతర్ మంతర్ వద్ద, ఎల్లుండి ఆంధ్ర భవన్ వద్ద నిరసన చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొనున్నారు. గుర్తింపు సంఘాల నాయకులు అయోధ్య రామ్, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్తో పాటు పలువురు కార్పొరేటర్లు దిల్లీ బయలు దేరి వెళ్లారు.
రెండు రోజులు పోరాటం
రెండు రోజుల పాటు దిల్లీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికే రైలులో బయలు దేరిన కార్మికులు దిల్లీకి చేరుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమం ఒక ఎత్తు కాగా.. ఇకపై జరిగే తంతు మరో ఎత్తు అని కార్మికులు అంటున్నారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: