తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్... వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు పార్టీ నాయకులతో ఏడు సమావేశాలు నిర్వహించారు. మొదట జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా పార్టీ స్థితిగతులపై చర్చించిన ఆయన ఉప ఎన్నికలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రచారం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 146 గ్రామాలు ఉండగా... ప్రతి రెండింటికీ ఒక ఇంఛార్జి, ప్రతి మండలానికి ఒక ముఖ్య నాయకుడు ఇంఛార్జ్‌గా పని చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అధికార పార్టీకి దీటైన అభ్యర్థిని ఎంపిక చేసి... ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి చేరవేసి ఓటర్లను ఆకర్షించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై..
వరంగల్-ఖమ్మం-నల్గొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... ఆరు జిల్లాల ముఖ్య నాయకులతో ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు... కాంగ్రెస్ నాయకులు నిరంతరం జనంలో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. కార్యకర్తలను భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయించుకునేలా చూడాలన్నారు. ఆరు జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై చర్చించిన ఠాగూర్... ప్రతి పది మండలాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకొని పని చేయాలని సూచించారు. క్రికెట్ టీమ్ మాదిరిగా ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థిగా భావించి శక్తి వంచన లేకుండా కృషి చేసినప్పుడే విజయం చేజిక్కించుకోవచ్చని స్పష్టం చేశారు.
కార్పొరేషన్ ఎన్నికలపై..
నగర కాంగ్రెస్ నాయకులతో ఠాగూర్ సమావేశమయ్యారు. డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితులు ఏలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. డివిజన్ల వారీగా ఇంఛార్జ్‌లుగా ఉన్న వారు చేపడుతున్న పార్టీ కార్యకలాపాలను, బూతు స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు తదితర అంశాల పురోగతిపై సమీక్షించారు. అనంతరం వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలపై... ఆయా నగరాల నాయకులు, పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. రెండు నగరాల్లో పార్టీ బలాబలాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత మధ్యాహ్నం గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్ధులతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
డీసీసీ అధ్యక్షులతో..
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశమైన ఠాగూర్... డీసీసీలు కీలకమని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి నెలా తాను డీసీసీలతో సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ప్రతి నెలా మండలాల వారీగా రాజకీయ కార్యకలాపాలు ఉండేట్టు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. చివరగా పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. రాత్రి పది గంటల వరకు సాగిన ఈ సమావేశంలో పీసీసీ చేపడుతున్న కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. కీలకమైన పదవుల్లో ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పార్టీ బలోపేతానికి ఏలాంటి కృషి చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్దేశించారు.
ఇదీ చూడండి: 'వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు'