ఏపీ పంచాయతీ ఎన్నికలపై ప్రతిష్టంభన తొలగలేదు... ఉత్కంఠకు తెరపడలేదు... ఎన్నికల సంఘం వెనకడుగు వేయలేదు... ప్రభుత్వం పట్టు వీడలేదు..! ముందు చెప్పినట్టుగానే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... పంచాయతీ ఎన్నికల నాలుగు దశలకూ శనివారం ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరి¸ పునరుద్ఘాటించింది. ఎస్‌ఈసీ తలపెట్టిన వీడియో సమావేశానికి అధికారులంతా ముఖం చాటేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్‌ఈసీపై విమర్శల జోరు మరింత పెంచారు. టీకా వేయకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు.
ఎవరూ హాజరు కాలేదు
ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఎస్‌ఈసీ.. ఎన్నికలను అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగసంఘాల వైఖరినీ తప్పుబట్టారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం మాత్రం తన వైఖరిని వీడలేదు. ఎస్‌ఈసీ వీడియో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా అధికారులెవరూ వెళ్లలేదు సరికదా, జిల్లా కలెక్టర్లనూ వెళ్లనివ్వలేదు.
సుప్రీం తీర్పుపై ఆసక్తి
తాజా పరిణామాలపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానున్న తరుణంలో.. అందరి చూపూ సుప్రీంకోర్టు వైపే ఉంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సోమవారం విచారించనున్న సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి : ఏపీ పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల