ప్రస్తుతం పెద్దవారే కాదు.. చిన్నారులూ మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. సినిమాలు, గేమ్స్, ఆన్‌లైన్ క్లాసులు అంటూ వాటి చుట్టూనే తిరుగుతున్నారు. అయితే ఓ నిర్ణీత సమయమంటూ లేకుండా ఇలా డిజిటల్ ప్రపంచమే లోకంగా గడిపే పిల్లల్లో పలు ప్రవర్తనా లోపాలు తప్పవని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం. ఇది అంతిమంగా వారి కెరీర్, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతోంది. అందుకే వారిని మొబైల్స్‌కి దూరంగా ఉంచమని సూచిస్తోంది. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. అందుకు తల్లిదండ్రులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
ఈ సమస్యలొస్తాయట!
కారణమేదైనా మొబైల్స్ వాడే పిల్లల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ఇలా నిరంతరాయంగా ఫోన్ వాడడం, అంతర్జాలానికే అతుక్కుపోవడం వల్ల పెరిగి పెద్దయ్యే కొద్దీ వారిలో సృజనాత్మకత, ఏకాగ్రత లోపించే ప్రమాదం ఉందని ‘కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం చెబుతోంది. అంతేకాదు.. నిరంతరాయంగా ఫోన్ వాడడం వల్ల వారిలో విశ్లేషణా సామర్థ్యం కూడా తగ్గిపోతుందట! నలుగురితో కలవడం కంటే ఒంటరిగా ఉండడానికే మొగ్గు చూపడం, ప్రకృతిని ఆస్వాదించలేకపోవడం, నచ్చని విషయాల కంటే నచ్చిన వాటిపైనే పూర్తి ఫోకస్ పెట్టడం.. వంటివి చేస్తారట! అందుకే చిన్నారులను అదీ ముఖ్యంగా ప్రి-స్కూలర్స్‌ని మొబైల్‌కి పూర్తిగా దూరంగా ఉంచమంటున్నారు నిపుణులు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పిల్లలు ఫోన్ వాడినా వారు ఏయే వెబ్‌సైట్స్ చూస్తున్నారు? ఎలాంటి సమాచారం శోధిస్తున్నారన్న విషయాలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచడం మంచిదని సలహా ఇస్తున్నారు.
డిజిటల్ డీటాక్స్ ఇలా చేయండి!
అప్పటిదాకా ఫోన్‌కు అలవాటు పడి ఇప్పుడు ఒక్కసారిగా మానేయమంటే పిల్లలు అందుకు అస్సలు ఒప్పుకోరు.. సరికదా మాకు అదే కావాలంటూ మొండికేస్తుంటారు. అలాంటప్పుడు వారిపై కోపం ప్రదర్శించడం, కొట్టడం.. వంటివి అస్సలు చేయకూడదు.. తద్వారా వారు మరింత మొండిగా తయారవుతారు.. కాబట్టి సున్నితంగా చెబుతూనే వారిని మొబైల్‌కు సాధ్యమైనంత దూరంగా ఉంచే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! ఇందుకు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
నేస్తం మీరే కావాలి!
ఇంటా బయటా ఆడుకోవడానికి తోడు లేని పిల్లలు మొబైల్‌నే తన నేస్తంగా భావిస్తారు. అందులోనే ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అలాగని మీ పనుల్లో మీరు బిజీగా ఉంటూ వారిని అలా వదిలేస్తే డిజిటల్ లోకంలో కూరుకుపోయి కొన్నాళ్లకు మిమ్మల్నీ మర్చిపోయే పరిస్థితి రావచ్చు! అందుకే వారిని ఆదిలోనే ఆ ఊబిలోంచి బయటికి లాగడం లేదంటే ఫోన్‌కు అలవాటు పడిపోకుండా ముందే జాగ్రత్తపడడం చేయాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులే వారి నేస్తాలు కావాలి. వృత్తిఉద్యోగాల బిజీ ఎప్పుడూ ఉండేదే కాబట్టి కాసేపు వాటిని పక్కన పెట్టి మీ చిన్నారులతో వారికి నచ్చిన ఆటలు ఆడడం, కబుర్లు చెప్పడం.. వంటివి చేయాలి. తద్వారా వారిని గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉంచిన వారవుతారు.. మీ ఇద్దరికీ మధ్య అనుబంధమూ రెట్టింపవుతుంది.
మీరుండగా ఫోన్ దండగ!
మాటలు నేర్చుకునే వయసులో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే పెద్ద వారు దగ్గర కూర్చోబెట్టుకొని మరీ ఒక్కో పదం వారికి నేర్పుతుంటారు. అదే వారు కాస్త పెరిగి పెద్దయ్యాక లేదంటే ఏదైనా పాఠ్యాంశంలో సందేహం వచ్చినా చాలామంది తల్లిదండ్రులు దాన్ని నివృత్తి చేయకపోగా ఇంటర్నెట్‌లో శోధించమని సలహా ఇస్తుంటారు. ఇదే క్రమంగా వారు మొబైల్‌కు అలవాటు పడేందుకు బీజం వేస్తుంది. అంతేకాదు.. కొన్నాళ్లు పోయాక వారికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి విషయాన్నీ అంతర్జాలంలోనే శోధించడం అలవాటు చేసుకుంటారు. ఈ క్రమంలో జరిగే మంచి కంటే చెడే ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. అందుకే పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా మీరే వారిని దగ్గర కూర్చోబెట్టుకొని వారి సందేహాలను నివృత్తి చేయడం, ఒకవేళ మీకూ ఫలానా విషయం తెలియకపోతే మీరే ఆన్‌లైన్‌లో వెతికి దాని గురించి పిల్లలకు వివరించడం.. వంటివి చేయడం వల్ల వారిని డిజిటల్ ప్రపంచానికి కొంత వరకు దూరంగా ఉంచిన వారవుతారు. అలాగే దీనివల్ల అటు తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది కూడా!
టెక్-ఫ్రీ జోన్స్ వారి కోసమే!
ఈ కరోనా కాలంలో చాలామంది పిల్లలకు తమ సొంత ఫోన్లుంటున్నాయి. గతేడాది కాలంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండడమే ఇందుకు కారణం! అయితే క్లాసుల పేరుతో అవసరం ఉన్న సమయంలోనే కాదు.. ఇతర సమయాల్లోనూ దాంతోనే గడుపుతున్నారు చిన్నారులు. పైగా ఆన్‌లైన్ క్లాసు ఇంకా పూర్తి కాలేదంటూ అబద్ధం చెప్పే పిల్లలూ లేకపోలేదు. అంతేకాదు.. భోజనం చేసేటప్పుడు, ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు, ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి వెళ్లినా.. ఇలా ఎక్కడికెళ్లినా మొబైల్ వారి వెంట ఉండాల్సిందే! కానీ ఇది సరికాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే బయటికి వెళ్లినప్పుడు, ఫ్రెండ్స్‌తో గడిపినప్పుడు వారు మొబైల్‌లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులుగా మీకు తెలియదు.. ఈ క్రమంలో చెడు సమాచారం తెలుసుకొని వారు పెడదారి పట్టే అవకాశాలూ లేకపోలేదు.. కాబట్టి కేవలం అవసరమున్న సమయాల్లో తప్ప ఇతర సమయాల్లో వారి వద్ద ఫోన్ లేకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులదే! ఈ క్రమంలో వినకుండా మొండికేసే చిన్నారులకు కాస్త గట్టిగా చెప్పడానికీ వెనకాడకపోవడమే మంచిది.
ఎమోషన్స్‌ని దాంతో ముడిపెట్టద్దు!
కోపమొచ్చినా, బాధ కలిగినా, సంతోషంగా అనిపించినా.. ఇలా ఎలాంటి భావోద్వేగాన్నైనా పంచుకోవడానికి ఇప్పుడు మొబైల్స్‌నే ఆశ్రయిస్తున్నారు చాలామంది. పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌తో వీడియో కాల్స్, ఫోన్లు, నిరంతరాయంగా వాట్సప్ చాట్స్.. ఇలా ఫోన్లో వారికి తెలియని ఫీచరంటూ లేదు. అయితే ఇదే అలవాటు వారిని ఫోన్‌కు బానిసయ్యేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఎలాంటి ఎమోషన్స్‌నైనా మీతోనే పంచుకునేలా వారి వెన్నంటే నిలవాలి. మీరెంత బిజీగా ఉన్నా కూడా వారి ప్రవర్తనను నిరంతరం గమనిస్తూనే.. రోజూ కాసేపు వారితో సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. తద్వారా పిల్లల్ని మొబైల్‌కు దూరంగా ఉంచడంతో పాటు మిమ్మల్ని మిస్సవుతున్నామన్న భావన వారిలో కలగకుండా జాగ్రత్తపడచ్చు.
ఇలా పిల్లల విషయంలో డిజిటల్ డీటాక్స్ పద్ధతిని పాటించడం వల్ల వారు మొబైల్‌కు అతుక్కుపోకుండా జాగ్రత్తపడచ్చు.. ఫలితంగా పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎలాంటి ప్రవర్తనా లోపాలు తలెత్తకుండా ఉంటుంది.
మరి, మీ పిల్లల్ని మొబైల్స్‌కి దూరంగా ఉంచేందుకు మీరెలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? కింది కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి. మీరిచ్చే సలహాలు ఇతర పేరెంట్స్‌కీ ఉపయోగపడచ్చు..!
ఇదీ చదవండి: మంత్రి కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు