ETV Bharat / city

కరోనాకు మానసిక స్థైర్యమే మందు.. ఆత్మహత్యలు వద్దు!

కరోనా సోకడంతో అనేక మంది మానసికంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భయానికి మించిన శత్రువు మరోటిలేదని నిపుణులు అంటున్నారు. అనవసరమైన భయాలు వీడి.. దీనిపై అవగాహన పెంచుకుని జయించాలని వారు సూచిస్తున్నారు. మనోస్థైర్యాన్ని దెబ్బతీసే అంశాలు వినకపోవడం, ఆశావహ ధృక్పథంతో వైరస్​ను త్వరగా జయించవచ్చని వారంటున్నారు.

author img

By

Published : May 15, 2021, 7:46 AM IST

 corona suicides, corona deaths
కరోనా ఆత్మహత్యలు, కరోనాతో మృతి

భయాన్ని మించిన శత్రువు లేదంటారు.. కరోనా విలయం చుట్టుముడుతున్న వేళ అనవసర భయాలు ఇప్పుడు బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైతే చాలు.. ఇక ఏమైపోతామోనన్న తీవ్ర ఆందోళన, బతికే అవకాశమే లేదన్న నైరాశ్యం, వైద్యఖర్చులకు డబ్బులు ఎలాగన్న బెంగ, అత్యవసరమైతే ఆస్పత్రిలో పడక, ఆక్సిజన్‌ లభిస్తుందో లేదో? ఏ క్షణానికి ఏం జరిగి పోతుందో? అనే అతి ఉద్వేగం, చికిత్స తీసుకుంటున్న సమయంలో ఒంటరితనం, చుట్టూ తనవాళ్లెవరూ లేకపోవటంతో కుంగుబాటు.. ఇలా అనేక అంశాలు కొవిడ్‌ బాధితుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో కొవిడ్‌ భయంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బావిలో దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీలో రోజూ ఎక్కడో ఓచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీరిని ఆత్మహత్యల వైపు నెడుతున్న పరిస్థితులేమిటి? ఆయా ఆలోచనల నుంచి వారిని బయటకు తీసుకొచ్చి మనోస్థైర్యం నింపటమెలా? స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులు ఎలాంటి పాత్ర పోషించాలి? దీనిపై నిపుణులు ఇస్తున్న సూచనలేమిటి?

ఒంటరితనమే పెద్ద బాధ..

కొవిడ్‌ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది ఆస్పత్రి అంతస్తుల పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. వారిలో ఒంటరితనం, చుట్టూ తమ వాళ్లూ ఎవరూ లేరన్న ఆందోళనే దీనికి కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే రోగితోపాటే కుటుంబసభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరు ఉండేవారు. దాంతో రోగి ఆత్మస్థైర్యం పెరిగి, త్వరగా కోలుకోవటానికి దోహదపడేది. కొవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరినవారికి పక్కన ధైర్యం చెప్పేందుకు ఎవ్వరూ ఉండటానికి వీల్లేని దుస్థితి. దానికి తోడు పక్కనున్న రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. వారిని చూసి మరింత భయానికి గురవుతున్నారు. ఇది తీవ్రమై కుంగుబాటుకు దారి తీసి ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తోంది. ఒక్కోసారి వాటిని భరించలేక.. ప్రాణాలు తీసుకుంటున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆస్పత్రుల్లో ఖర్చుల భయంతో..

వైద్య ఖర్చులకు భయపడి పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారు. దాచుకున్న కొద్దిపాటి డబ్బులన్నీ వైద్యానికి ఖర్చుచేసేసినా నయమవని పరిస్థితుల్లో.. ఇంకెంత ఖర్చు చేసినా తాను బతకనని, కనీసం తాను ఆత్మహత్య చేసుకుంటే కుటుంబమైనా బాగుంటుందనే భావనకు లోనై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఒకేసారి కుటుంబం మొత్తం కొవిడ్‌ బారిన పడినా, వారిలో అలాంటి లక్షణాలు కనిపించినా ఏమైపోతుందోనన్న ఆందోళనతో అందరూ కలిసి బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. కొవిడ్‌ బారిన పడి ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నప్పుడు చికిత్స కోసం డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలియక ఆందోళనకు లోనై మరికొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు.

అనవసర ఆందోళనతో..

ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నా తమకేదో అయిపోతోందన్న ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ ఉన్నారు. ప్రధానంగా వ్యాధి లక్షణాలు, దాని బారిన పడితే ఏం చేయాలనే అవగాహన లేకపోవటం వల్ల భయంతో అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంకొందరైతే కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలగానే తమ వల్ల కుటుంబసభ్యులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్న ఆందోళనతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ అనవసర భయాలే!

అవగాహన పెంచుకోండి..

  • కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైతే.. ఇక అంతా అయిపోయిందనే భయం చాలామందిని వెంటాడుతోంది. అది కాస్తా ఆందోళనగా, కుంగుబాటుగా మారి బలవన్మరణాలకు దారితీస్తోంది. కొవిడ్‌ వచ్చినంత మాత్రాన ప్రాణాలు పోతాయన్న అపోహా విడనాడి అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • గతంలో కరోనా కేసులు తక్కువగా నమోదైనప్పుడు మరణాలూ తక్కువగానే ఉండేవి. ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతోంది కనుక మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. వాటిని చూసి ఆందోళన పడక్కర్లేదు.

ఇలా చేస్తే.. బయటపడొచ్చు!

  • మనిషి సంఘజీవి. కరోనా చికిత్స పొందుతున్నప్పుడు ఒంటరిగా ఉండాల్సి రావటం వల్ల ఆందోళన, కుంగుబాటు వంటివి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇది మానసికంగానే కాక భౌతిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొవిడ్‌ బారినపడినవారికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అండగా నిలవాలి. నిరంతరం వారితో మాట్లాడుతుండాలి. ‘నీకేం కాదు.. ఇది చాలా సహజం. చిన్న రొంప లాంటిదే. సులువుగా బయటకొచ్చేస్తావు’ అంటూ సానుకూల దృక్పథం పెంచేలా మాటలు చెప్పాలి.
  • 80 ఏళ్లకు పైబడిన వారూ కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉంటున్నారు. మన పరిసరాల్లో ఉన్న అలాంటి వారి గురించి చెబుతూ ధైర్యం నూరిపోయాలి.
  • తరచూ వీడియోకాల్స్‌ చేయటం, ఫోన్‌లో మాట్లాడుతూ గతంలోని మధుర జ్ఞాపకాల్ని గుర్తుచేయటం వంటివి చేయాలి. అంతా కలిసి సరదాగా గడిపిన క్షణాలను పంచుకోవాలి.
  • స్వచ్ఛంగా నవ్వుతూ, బుజ్జి బుజ్జి మాటలు చెప్పే చిన్నపిల్లలను వీడియోకాల్స్‌/ ఫోన్‌ ద్వారా కొవిడ్‌ రోగులతో మాట్లాడించాలి. ఇది వారి మానసిక ఆరోగ్యానికి విటమిన్‌లా పనిచేస్తుంది.
  • సామాజిక మాధ్యమాల్లో ఆందోళన పెంచే సమాచారానికి కొవిడ్‌ రోగులు దూరంగా ఉండాలి.
  • ప్రశాంతంగా నిద్ర పోయేలా చూసుకోవాలి. ఒత్తిడికి గురిచేసే విషయాలు ఆలోచించొద్దు.
  • కొవిడ్‌ బారినపడ్డ చాలా మంది ఆర్థిక సమస్య వల్లే ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి వారికి స్నేహితులు, బంధువులు వీలైనంత వరకూ అండగా ఉండాలి. ఏం కాదు.. అవసరమైతే డబ్బులు సర్దుబాటు చేస్తాం. వాటి గురించి ఆందోళనపడకు.. ధైర్యంగా ఉండు అనే భరోసా ఇవ్వగలగాలి.

మరణాలు 0.66 శాతమే..

"ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 13,88,803 మందికి కొవిడ్‌ నిర్ధారణైతే అందులో 11,75,843 మంది (84.66 శాతం) కోలుకున్నారు. మరో 2,03,787 మంది అంటే 17.33 శాతం మంది చికిత్స పొందుతున్నారు. వీరూ కోలుకుంటున్నట్లే. కేవలం 0.66 శాతం మందే మరణించారు. అందుకే లేనిపోనివి ఊహించుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకొవద్దు."

-కర్రి రామారెడ్డి, సైక్రియాటిస్ట్‌, రాజమహేంద్రవరం

ఆశే బతికిస్తుంది..

"కరోనా వచ్చిందని ఆందోళన చెందటం వల్ల గుండె కొట్టుకోవటంలో వేగంగా పెరిగిపోతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. పీడకలలు వస్తాయి. ఇవన్నీ ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తాయి. అలాంటి వారే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. రోప్‌ వేపై నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా అది తెగిపోతే కొంతమంది తాము బతకమన్న భయంతో ఆ తాడును వదిలేసి కిందపడి ప్రాణాలు కోల్పోతుంటారు. ఇంకొంతమంది ఎవరో ఒకరు వచ్చి సాయం చేయకపోరా? అనే ధైర్యంతో చివరి క్షణం వరకూ ఆ తాడునే పట్టుకుని ధైర్యంగా ఉంటారు. సహాయ చర్యల్లో అలాంటివారు ప్రాణాలు దక్కించుకుంటారు. కరోనా రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వస్తే ధైర్యంతో వ్యవహరించాలి. కరోనా నుంచి కోలుకున్న రోగులు ఎవరైనా వాలంటీర్లుగా పనిచేయటానికి ముందుకొస్తే అలాంటి వారిని కొవిడ్‌ వార్డుల్లోకి వారిని పంపించి రోగులకు ధైర్యం నింపాలి. ఒంటరితనం పోగొట్టే ప్రయత్నం చేయాలి."

-డా.ఎన్‌.ఎన్‌.రాజు, ఇండియన్‌ సైక్రియాటిక్‌ సొసైటీ జాతీయ అధ్యక్షుడు

సానుకూలాంశాలే వినాలి..

కొవిడ్‌ భయంతో ఆత్మహత్యలు చేసుకోవటానికి ప్రధాన కారణం అవగాహన లేకపోవటమే. అపోహాలూ దీనికి దోహదం చేస్తున్నాయి. అందుకే కొవిడ్‌ రోగులు సానుకూలాంశాల్నే వినాలి. ఎలాంటి చర్యలతో వారికి ఆనందం కలుగుతుందో గుర్తించి వాటిపై దృష్టిసారించాలి. భవిష్యత్తు లక్ష్యాలపై ఆశావాహ దృక్పథం ఉండాలి. సానుకూల అంశాల గురించి ఆలోచిస్తే ఆనందాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. తద్వారా ఆశావహ దృక్పథం పెరుగుతుంది. చీకట్లోనూ కాంతి పుంజాలు కనిపిస్తాయి. కొవిడ్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ప్రణాళికబద్ధమైన దినచర్య ఉంటే.. ప్రతికూల అంశాల వైపు మనసు మళ్లకుండా ఉంటుంది. అలాగే కరోనా వస్తే ఏం చేయాలి? అనే ప్రణాళిక ముందే ఉంటే కొంత ఆత్మస్థైర్యంతో ఉండొచ్చు.

ఇవీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.