Skylifts: హైదరాబాద్ సహా మరే ఇతర నగరాలు, పట్టణాల్లో చూసినా ... బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోతున్నాయి. భవనాల్లో అకస్మాత్తుగా చోటు చేసుకునే అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరైన అగ్నిమాపక ప్రమాణాలు పాటించకపోవటంతో... మంటలను అదుపులోకి తీసుకురావటం అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను నిలబెట్టేందుకు "స్కైలిఫ్ట్‌లు" ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ఓ భవనంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదట మంటలు ఎగిసిపడి దట్టమైన పొగ అలుముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది... మంటల్ని ఆర్పేశారు. భవనం లోపల వ్యాపించిన పొగతో పైఅంతస్తులో ఉన్న వారు మెట్లపై నుంచి కిందికి రాలేని పరిస్థితి నెలకొంది. "స్కై లిఫ్ట్"ను తీసుకువచ్చి పైఅంతస్తులో ఉన్న 14మందిని సురక్షితంగా కిందికి దించారు.
బహుళ అంతస్తుల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని... ఈ " స్కైలిఫ్ట్"లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫిన్‌లాండ్ నుంచి రెండు భారీ స్కైలిఫ్ట్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. మాదాపూర్, సికింద్రాబాద్ అగ్నిమాపక కేంద్రాల్లో... ఈ బ్రాంటో స్కైలిఫ్ట్‌లను ఉంచారు. దాదాపు 54 మీటర్ల ఎత్తు.. 18 అంతస్తుల వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగలిగే సమర్థత వీటికి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విపత్తు వేళ ఎంతో ఉపయోగపడే బాహుబలి "స్కైలిఫ్ట్" వాహనాలు... హైదరాబాద్‌లో ప్రస్తుతం 2 మాత్రమే ఉన్నాయి. వీటిని మరిన్ని అందుబాటులోకి తీసుకువస్తే... ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చూడొచ్చని నగరవాసులు కోరుతున్నారు.