కొవిడ్ పరిస్థితుల నుంచి పరిశ్రమన్నీ కోలుకుంటున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గుకి సాధారణ స్థాయి డిమాండ్ వస్తోందని సీఎండీ శ్రీధర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్లు, అన్ని ప్రాంతాల జీఎంలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరిలో రోజుకి 1.95 లక్షల టన్నులు, మార్చిలో 2 లక్షల టన్నులు రవాణా జరపడానికి సంసిద్ధం కావాలని సూచించారు. అలాగే ఫిబ్రవరిలో 13.70 లక్షల క్యూబిక్ మీటర్లు, మార్చిలో 14 లక్షల అదనపు భారం తొలగింపు లక్ష్యంగా పెట్టుకొని ముందుకుపోవాలన్నారు. వచ్చే జూలై నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నందున... 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మేలో దూకుడుగా ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు.
2021-22 నాటికి నాలుగు కొత్త ఓపెన్ కాస్టు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతాయని సీఎండీ తెలిపారు. అడ్రియా లాంగ్ వాల్ కొత్త ప్యానెల్ నుంచి కూడా ఉత్పత్తి యథావిధిగా జరగనుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్దేశించారు. సింగరేణి బొగ్గు మార్కెట్‌ను 100 మిలియన్ టన్నుల వరకు విస్తరించేలా... 70 మిలియన్ టన్నుల రవాణాకు మార్కెటింగ్ విభాగం వారు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో అవగాహన కుదుర్చుకోవాలని ఆదేశించారు.
డిసెంబర్, జనవరి నెలల ప్రగతిని ప్రతి ఏరియా జీఎంతో సమీక్షించిన సీఎండీ... మణుగూరు ఏరియా సాధించిన ప్రగతిని ప్రశంసించారు. లక్ష్యాలు సాధించడానికి ప్రతి ఏరియా పోటీతత్వంతో ముందుకుసాగాలన్నారు. కొత్తగా ప్రారంభించాల్సి ఉన్న వెంకటాపూర్ ఓసీ, రొంపేడు ఓసీ, కేటీకే ఓసీ, విస్తరణ, గోలేటి ఓసీ, ఎంవీకే ఓసీ, జీడీకే 10 ఓసీ గనులకు అనుమతులు పొందడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. వచ్చే ఏడాది సాధించాల్సిన లక్ష్యాలు, వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్న పనుల ఒప్పందాలు, కాంట్రాక్టులకు సంబంధించి ఫిబ్రవరి 10, 11 తేదీల్లో డైరెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులతో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: మంజీర నదిపై 6 చెక్ డ్యామ్‌ల నిర్మాణం : మంత్రి వేముల