ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని కారణంగా రాష్ట్రంలో 17 మంది సర్పంచులు తమ పదవులను కోల్పోయారు. వీరితో పాటు ఆరుగురు ఎంపీటీసీలు, 3,499 మంది వార్డు సభ్యుల పదవులూ పోయాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు ప్రకటించింది.
2019లో జరిగిన గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు 36,369 మంది పోటీ చేయగా.. 3,789 మంది ఎన్నికల ఖర్చుల వివరాలు అందించలేదు. ఆ కారణంతో వారిపై మూడేళ్ల పాటు అనర్హత వేటు పడింది. గెలుపొందిన 17 మంది సర్పంచులూ వారి పదవులను కోల్పోయారు. ఎంపీటీసీలుగా 19,090 మంది పోటీ చేయగా.. 3,105 మంది వివరాలు అందించలేదు. వారూ మూడేళ్ల పాటు అనర్హులు కాగా.. గెలుపొందిన ఆరుగురు పదవులను కోల్పోయారు.
వార్డు సభ్యుల పదవులకు 2,30,486 మంది పోటీ చేయగా.. 32,257 మంది ఎన్నికల ఖర్చుల వివరాలు ఇవ్వలేదు. వారందరిపైనా అనర్హత వేటు పడగా.. అందులో ఎన్నికైన 3,499 మంది పదవులనూ కోల్పోయారు. 2,429 మంది జడ్పీటీసీ అభ్యర్థులకుగాను 348 మంది వివరాలు ఇవ్వకపోవడంతో అనర్హులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియాపల్లి, జియాపల్లి తండా గ్రామపంచాయతీల్లోని వార్డుసభ్యులందరూ ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించలేదు. అందువల్ల వారంతా పదవులు కోల్పోయారు. ఆ రెండు పంచాయతీల్లో కేవలం సర్పంచులు మాత్రమే మిగిలారు.
ఇదీ చూడండి: డ్రైరన్‌కు సాఫ్ట్‌వేర్ తిప్పలు... కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఆరోగ్యశాఖ