దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌లగ్జరీ సర్వీసుల్లో తొలుత 50 శాతం సీట్లు ఆన్‌లైన్‌లో కనిపించేలా మార్పులు చేస్తున్నారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు. ఇవన్నీ బుక్ అయ్యాకే, మిగిలిన సీట్లు ఆన్‌లైన్‌లో కనిపించనున్నాయి. అంటే ప్రయాణికుల రద్దీ ఉంటే, సీట్లన్నీ భర్తీ కానున్నాయి. అయితే వీటిలో కూడా 50 శాతం సీటింగుకు మాత్రమే అనుమతిస్తేనే వైరస్ వ్యాప్తి అడ్డుకునే వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగుల్లో పెరుగుతున్న కేసులు
కొవిడ్‌బారిన పడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండోదశలో ఇప్పటి వరకు 748 మంది వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 123 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. మొత్తంగా గతేడాది నుంచి ఇప్పటి వరకు 105 మంది ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. తమకు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యకార్డులు ఇంకా జారీ చేయలేదని, దీనివల్ల కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స పొందాల్సి వస్తోందని ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి తెలిపారు. అన్ని సర్వీసుల్లో 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు కోరారు. ఉద్యోగులందరికీ త్వరగా టీకాలు వేసేలా చూడాలని ఎస్‌డబ్ల్యుఎఫ్ ప్రధాన కార్యదర్శి సుందర్‌రావు విన్నవించారు.
కర్ణాటకకు వెళ్లే అన్ని సర్వీసుల్లో 50 శాతమే..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కర్ణాటకకు నడిపే అన్ని ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసుల సీట్ల సామర్థ్యంలో 50 శాతం మాత్రమే ప్రయాణికులను అనుమతించనున్నారు. ఈ నెల 21 నుంచి మే 4 వరకు కర్ణాటకలో నడిచే అన్ని బస్సుల్లో 50 శాతం సీటింగ్ ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో... ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రయాణాలకు వెనకడుగు..
కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిసంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈనెల మొదటివారంలో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 62 శాతం ఉండగా, ఇప్పుడది సగటున 58 శాతానికి తగ్గింది. గురువారం 49.82 శాతం ఓఆర్ వచ్చింది. విజయవాడలోని సిటీ బస్సుల్లో ఓఆర్ అతి తక్కువగా 40 శాతంగా ఉంది. కరోనా తొలివిడత తగ్గిన తర్వాత రోజుకు సగటున రూ.12-13 కోట్ల వరకు రాబడి ఉండగా, ఇప్పుడది రూ.8-8.5 కోట్లకు పడిపోయింది.
ఇదీ చదవండి: మినీ పోల్స్‌పై సమగ్ర నివేదిక ఇవ్వండి: గవర్నర్