TTD SARVADARSHNAM: తిరుమల శ్రీవారి సర్వదర్శన భక్తులకు.. అదనంగా 2 గంటలు దర్శనం కల్పిస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ, సిఫార్సు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాల రద్దుతో.. భక్తులకు అదనంగా 3 గంటలు దర్శన భాగ్యం లభిస్తుంది.
సర్వదర్శనం టోకెన్లు సంఖ్య పెంపు..
శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచుతున్నట్లు తితిదే స్పష్టం చేసింది. ఈ మూడ్రోజుల్లో.. రోజుకు 30 వేల టోకెన్ల చొప్పున జారీ చేయనున్నట్లు తెలిపింది.
ప్రత్యేక దర్శన టికెట్ల పెంపు
ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వీటితో పాటు మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా రోజుకు 25 వేల చొప్పున విడుదలయ్యాయి. మరోవైపు సర్వదర్శనం టికెట్లను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా 5వేల చొప్పున తిరుపతిలోని కౌంటర్ల ద్వారా భక్తులకు అందిస్తున్నారు.
సర్వదర్శన టికెట్లు పెంపు
ఇప్పటి వరకు రోజుకు 15వేల సర్వదర్శన టికెట్లు ఇస్తుండగా.. మార్చి నెల నుంచి రోజుకు 20 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో ప్రకటిత రోజుల్లో అందజేయనున్నట్లు తితిదే వెల్లడించింది. ఇక తిరుపతి కౌంటర్లలో రోజుకు 20 వేల చొప్పున జారీ చేస్తున్న సర్వదర్శన టికెట్లను... భక్తులు నేరుగా తీసుకునే వెసులుబాటు ఉంది.
ఇదీ చదవండి: శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు