Sankranthi Rush in Hyderabad : సంక్రాంతి ప్రయాణికుల సందడి ఈనెల 7వ తేదీ నుంచే ప్రారంభమైంది. ఈనెల 15 వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల 318 బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ఏపీకి వెయ్యి, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు మరో 3 వేల 318 బస్సులు తిప్పుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆర్టీసీ ద్వారా సుమారు 25లక్షల వరకు ప్రయాణికులను చేరవేసినట్లు ప్రకటించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా కూడా భారీగానే ప్రయాణికులు సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్ , కూకట్ పల్లి, ఎల్.బీనగర్, వనస్థలిపురం, మియాపూర్, మెహిదీపట్నం, ఆరాంఘర్ చౌరస్తాలు రద్దీగా మారాయి.
ప్రైవేట్ ట్రావెల్స్ సందడి..
Sankranthi Rush in Secunderabad : ఈ ఏడాది ఆర్టీసీ సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తుంది. ఫలితంగా ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఓఆర్ కూడా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇక నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ సందడి కనిపిస్తోంది. పండగ వేళ నిర్వాహకులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలిపారు. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోందంటున్నారు.
105 ప్రత్యేక రైళ్లు.. 198 ట్రిప్పులు..
Rush in Hyderabad : బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండడంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే 105 ప్రత్యేక రైళ్లను 198 ట్రిప్పులుగా నడిపిస్తుంది. సాధారణ ప్రయాణికుల కోసం జన్ సాధరణ్ రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.