ఏపీలోని విశాఖకు చెందిన సంగీత.. ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడింది. వివాహానంతరం.. భర్త ఆదిశేషుతో కలిసి బెంగళూరుకు మకాం మార్చింది. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రావడం వల్ల భారత్‌ను వదిలివెళ్లింది. జీవితంలో ఏదో కోల్పోతున్నానన్న అసంతృప్తి సంగీతలో అప్పుడే ప్రారంభమైంది.
అలా గుర్తించింది:
కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం సంగీతకు యాంత్రికంగా అనిపించేది. అంతకుముందే పెయింటింగ్‌లో ప్రవేశముండడం వల్ల... స్థానికంగా జరిగే ప్రదర్శనలకు హాజరయేది. ఆర్ట్ మ్యూజియంలను సందర్శించేది. అలా తనకు ఇష్టమైన పెయింటింగ్‌కు దూరం కావడమే తనలోని అసంతృప్తికి కారణమని గుర్తించింది సంగీత.
ఆ నిర్ణయమే పెద్ద మలుపు:
చిత్రకళ పట్ల తనకున్న అభిరుచికి పూర్తి స్థాయిలో మెరుగులు దిద్దుకోవాలని సంగీత నిర్ణయించుకుంది. కుటుంబసభ్యుల సహకారంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, సొంతూరికి తిరిగివచ్చింది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఆత్మసంతృప్తికి మించిన ఆనందం లేదని తెలుసుకునేలా చేసింది. విశాఖకు తిరిగివచ్చిన సంగీత... చిత్రకళపై పూర్తిస్థాయిలో పట్టు సంపాదించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఫైన్‌ఆర్ట్స్ విభాగంలో నాలుగేళ్ల బీఎఫ్ఏ కోర్సులో చేరింది. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతోంది.
కళాఖండాలతో కృతజ్ఞతలు:
గతేడాది దేశంలో నెలకొన్న పరిస్థితులు సంగీత ఆలోచనలకు పదునుపెట్టాయి. దేశమంతా ఇంటిపట్టునే సురక్షితంగా ఉంటే... వారందరి రక్షణ కోసం ముందుండి పనిచేసిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు తన కళ ద్వారా కృతజ్ఞతలు చెప్పాలనుకుంది. వాటర్ కలర్స్ వినియోగించి, వారి కోసం 12 అద్భుతమైన కళాఖండాలు గీసింది. అవి తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని చెప్తోంది సంగీత.
పాఠ్యపుస్తకాల్లో చోటు:
సంగీత గీసిన చిత్రాలు... సీబీఎస్ఈ 9, 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకున్నాయి. బాంబే ఆర్ట్ సొసైటీ... ఏటా ఓ మ్యాగజైన్ విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా సామాజిక అంశాలపై కళ ద్వారా అవగాహన కల్పించే మేటి కళాఖండాలను ఎంపిక చేసి, ప్రచురిస్తుంది. ఆ మ్యాగజైన్‌లోనూ ఈ ఏడాది సంగీత గీసిన చిత్రాలకు స్థానం దక్కింది.
ఆ సంతృప్తే వేరే..
భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత... పూర్తి సమయం కళ కోసమే కేటాయిస్తోంది సంగీత. ఓ కళాఖండం ముందు నిలబడి, ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం వీక్షకుడికి కలిగేలా గీసినప్పుడే చిత్రకారిణిగా విజయం సాధించినట్లని చెప్తోంది. తన చిత్రాలను ఎన్నో ప్రదర్శనల్లో ప్రదర్శించింది. మరెన్నో పోటీల్లో పాల్గొని, గెలుపొందింది. ప్రతీ కళాఖండం.. కళాకారుడి మనసుకు, ఆలోచనలకు ప్రతిబింబం అని చెప్తోంది సంగీత. పెయింటింగ్స్‌ని కంపోజ్ చేయడం ద్వారా తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకోవచ్చని సూచిస్తోంది. ప్రస్తుత టెక్ యుగంలో... కంప్యూటర్ ద్వారా వేసే డిజిటల్ పెయింటింగ్‌కు ఆదరణ పెరుగుతున్నా... చేత్తో ఓ చిత్రం గీస్తే వచ్చే సంతృప్తే వేరని చెప్తోంది సంగీత.
జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో రెండేళ్లుగా బహుమతులు సాధిస్తోంది సంగీత. ఈ ఏడాది ప్రథమ బహుమతి గెలుచుకుంది. అభిరుచి కోసం సరైన సమయంలో యువత తీసుకునే నిర్ణయాలు... వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా... కళారంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు దోహదపడతాయని సంగీత నిరూపించింది.
ఇదీ చూడండి: SCHOOLS OPEN: జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయం