ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చే నెల 3వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. సైబరాబాద్ సీపీగా విధులు నిర్వర్తించిన సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు మూడేళ్ల విరామం తర్వాత ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సైబరాబాద్ సీపీగా 2013 మార్చి 18న బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. సర్వీసులో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు.... సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్ సమయంలో వలస కూలీలను ఆదుకోవడం, సొంత ప్రాంతాలకు తరలించడం కోసం చొరవ తీసుకున్నారు. కొవిడ్ రోగులకు తగిన వైద్యసాయం అందించేందుకు ఉచిత ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందించడం, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కరోనా వేళ రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోవడంతో సజ్జనార్ ఏడాది వ్యవధిలో 3సార్లు రక్తదానం చేసి.. కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 5 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు అందించారు. శాఖాపరంగా పలు సంస్కరణలు చేపట్టారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పరిపాలన కొనసాగించారు.
ఇదీ చూడండి: