Sajjala On Employees Protest: ఉద్యోగులకు సమస్య పరిష్కరించుకునే ఉద్దేశం లేదనిపించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చర్చలకు రోజూ పిలుస్తున్నా రావట్లేదన్నారు. ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. బలప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలం అవుతుందని సజ్జల వ్యాఖ్యనించారు. సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి ఆందోళనల వల్ల అసలు విషయం పక్కకు పోతుందన్నారు. ప్రశాంతంగా ఆలోచించాకే ఉద్యోగులు ముందడుగు వేయాలన్నారు. వరుస చర్చల సమయంలో పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదన్నారు. ప్రదర్శనలు, సమ్మెల వల్ల ఏం సాధిస్తారో అర్థం కావటం లేదన్నారు. కొవిడ్ వల్ల రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని.. కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో తెలియదన్నారు. సంక్షేమానికి కూడా నిధులు అవసరమని అన్నారు. సీఎం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైందేనా అని ప్రశ్నించారు.
పీఆర్సీ ఏ విధంగా రూపొందించారో ఉద్యోగులకు ప్రభుత్వం వివరించిందని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంచి ప్యాకేజీ ఇచ్చామన్నారు. పీఆర్‌సీ నుంచి ఎక్కువగా ఆశించటం వల్లే ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొందని తెలిపారు. పొరుగుసేవల సిబ్బందికి ఠంఛనుగా జీతాలు ఇస్తున్నామని... ఉద్యోగులు తమ వారే అనుకుని ప్రభుత్వం ఎంతో చేసిందని సజ్జల అన్నారు.
"దశాబ్దాలుగా తక్కువ జీతాలున్న అంగన్‌వాడీలకు మంచి జీతాలిచ్చాం. ఆశా, మున్సిపల్ వర్కర్లకు గత ప్రభుత్వాల కంటే మంచి జీతాలిచ్చాం. ఉపాధ్యాయులకు 7-8 విషయాల్లో మేము ఉపకారం చేశాం. సీఎం దృష్టికి ఏదొచ్చినా ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం. స్కూల్ అసిస్టెంట్లకు మా ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చిందని వాళ్లే చెప్పారు. ఉద్యోగ భద్రత గత ప్రభుత్వంలో లేదు, మేమే కల్పించాం. 27శాతానికి మించి చేయాలని ఉన్నా సంక్షేమం వల్ల చేయలేదు. సంక్షేమానికి దోచి పెడుతున్నామనడంలో అర్థం లేదు. ప్రభుత్వం ఎక్కడైనా దుబారా చేస్తుంటే చెప్పండి. ఉద్యోగులు కోరినంత చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. ఉద్యోగ నాయకులు ప్రభుత్వం చేసిన దానికి వారు క్రెడిట్ తీసుకోవాలి. కరోనా వల్ల ఇప్పటికే అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. జీతాల్లో ఎవరికీ కోతల్లేవు..ఉంటే వచ్చి అడగండి. వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నాం."
-సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇదీ చూడండి:
హైదరాబాద్ పర్యటనలో పీఎం మోదీ.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్న సీఎస్