Hydrama in AEE Nikesh Kumars House During Search : కలకలం రేపిన నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌కుమార్ అక్రమాస్తుల కేసులో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడుల సమయంలో నిఖేశ్‌కుమార్ తన ఆస్తుల దస్త్రాల ఆధారాలు దొరకకుండా ప్రయత్నం చేశాడు. అధికారులు తలుపు తట్టగానే, వారిని లోపల కూర్చోబెట్టి కుటుంబసభ్యులకు సంకేతాలు ఇచ్చాడు. దీంతో వారు దస్త్రాలను మూటగట్టి బాల్కనీ నుంచి బయటకు విసిరేశారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ బృందం ఆ సంచిని స్వాధీనం చేసుకుంది. సోదాల సమయంలో నిఖేశ్ కుమార్ ఇంట్లో హైడ్రామా కొనసాగించాడు. అరెస్టును తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. ట్రాప్ కేసులో తనను ఇది వరకే అరెస్ట్ చేసిన క్రమంలో ఇప్పుడు నోటీస్ ఇచ్చి వదిలేయాలని అడిగినట్లు సమాచారం. అధికారికంగానే రూ.17.73 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన క్రమంలో అలాంటి ప్రసక్తే లేదని ఏసీబీ తేల్చి చెప్పినట్లు సమాచారం.
సోదాల సమయంలో అతడి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు తప్ప, ఒక్క పైసా లభించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే 6 నెలల క్రితమే ఏసీబీకి చిక్కిన క్రమంలో నిఖేశ్ కుమార్ పలు జాగ్రత్తలు తీసుకుని ఉంటాడని తెలుస్తోంది. అందుకే ఇంట్లో నగదు, బంగారం ఉంచకుండా చూసుకున్నట్లు సమాచారం. అయితే మరోచోట మాత్రం నిఖేశ్‌కుమార్‌కు సంబంధించిన 8 బ్యాంకు లాకర్లున్నట్లు ఏసీబీ బృందాలు గుర్తించాయి. వాటి తాళాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి నిఖేశ్ కుమార్ పేరిటే ఉన్నాయా? లేక బినామీల పేరిట ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. అతడిని కస్టడీకి తీసుకున్న అనంతరం అతని సమక్షంలోనే వాటిని తెరవాలని నిర్ణయించారు. వాటిని తెరిస్తేగానీ సొత్తు దాచాడా? లేదా అనేది తేలనుంది.
సర్వెంట్‌ను బినామీగా : మరోవైపు నిఖేశ్‌కుమార్‌కు చెందిన 5 ఐఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వాటిని వినియోగించినట్లు తేలడంతో వాటిని విశ్లేషించడంపై దృష్టి సారించారు. అతడి అక్రమార్జనకు సంబంధించి కీలక సమాచారం వాటిల్లో వెల్లడవుతుందని భావిస్తున్నారు. తన అక్రమార్జనతో నిఖేశ్ కుమార్ కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే గతంలో అతని ఇంట్లో పని చేసిన ఒక సర్వెంట్‌ను బినామీగా ఉపయోగించుకొని కొన్ని ఆస్తులను అతడి పేరిట ఉంచినట్లు ఆధారాలు సేకరించారు. అయితే ఆ సర్వెంట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో అతడిని పిలిచి విచారించనున్నారు. మరోవైపు నిఖేశ్‌కుమార్ భార్య తరఫు బంధువుల పేరిట సైతం కొన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు అయిదారుగురి పేరిట ఈ ఆస్తుల్ని గుర్తించారు. వారి నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. త్వరలోనే వారికి నోటీసులిచ్చి వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు.
3 ఫామ్‌హౌస్‌లు : మొయినాబాద్ మండలం సజ్జనపల్లి, తోలకట్ట, నక్కలపల్లిలో ఫాంహౌస్‌లను 2021-22 ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దాదాపు నాలుగెకరాల విస్తీర్ణం కలిగిన ఈ మూడు ఫామ్ హౌస్‌ల కోసం సుమారు రూ.5 కోట్లు వెచ్చించినట్లు వెల్లడైంది. వీటిని కొనుగోలు చేసే క్రమంలో తొలుత బయానా కట్టిన అనంతరం మిగిలిన మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. దీన్ని బట్టి అక్రమార్జనను స్థిరాస్తులుగా మలుచుకునేందుకు నిఖేశ్‌కుమార్ ప్రాధాన్యమిచ్చినట్లు భావిస్తున్నారు. ఓ వాణిజ్య భవనం కొనుగోలు చేసేందుకు రూ.3.5 కోట్లు కట్టినట్లు ఉన్న రశీదులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చంచల్‌గూడ జైల్లో మంతనాలు : గత మే 30న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన క్రమంలో నిఖేశ్‌కుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదే సమయంలో ఏసీబీ కేసులోనే అరెస్టయి జైళ్లో ఉన్న పోలీస్ అధికారిని నిఖేశ్‌కుమార్ తరచూ కలిసినట్లు గుర్తించారు. ఏసీబీ కేసుల్లో చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ చిక్కితే ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఏం చేయాలి? కేసుల నుంచి బయటపడే మార్గాలేంటీ? అనే అంశాలపై సదరు పోలీస్ అధికారితో మంతనాలు సాగించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆరు నెలల క్రితమే చిక్కిన నిఖేశ్‌కుమార్‌పై అప్పటి నుంచే ఏసీబీ అధికారులు ఓ కన్నేసి ఉంచడంతో పాటు జైలు నుంచి విడుదలైన అనంతరం అతడి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడంతో ఇలాంటి అనేక విషయాలను తెలుసుకోగలిగారు. నిఖేశ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నాక విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశముంది.