కొద్ది రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు హైదరాబాద్లో కొన్ని పురాతన ఇళ్ళు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. పోలీసుల సాయంతో జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి కొన్ని ఇళ్ళు గుర్తించే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ఖైరతాబాద్ డివిజన్‌లోని తుమ్మలబస్తీలో నాలా పక్కన ఓ ఇంటి గోడ కూలిపోయి ఉండటం గమనించారు. అక్కడకు వెళ్లిన సిబ్బందికి లోపల ఓ వృద్ధురాలు కనిపించింది. లేవలేని స్థితిలో ఆమెను చూసి చలించిపోయారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సకలసౌకర్యాలతో...
వృద్ధురాలి వివరాలు సేకరించి యాదమ్మగా గుర్తించారు. సైఫాబాద్ పోలీస్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రాజు నాయక్ యాదమ్మకు ఇల్లు కట్టించి ఇవ్వాలని తలిచారు. ఇల్లు నిర్మించినంత కాలం బుద్వేల్లోని తనకు తెలిసిన థామస్ వృద్ధాశ్రమానికి యాదమ్మను తరలించారు. తన సొంత ఖర్చులతో వృద్ధురాలి ఇంటిని తిరిగి నిర్మించారు. ఇందుకు స్టేషన్లోని ఎస్సైలు సైతం తోడవగా... అన్ని సౌకర్యాలు సమకూరాయి. యాదమ్మకు ఇక ఏ లోటూ రాకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయించారు. పడుకోవడాని మంచం, పరుపు, గదిలో ఫ్యాను, లైట్లు ఏర్పాటు చేశారు.
చనిపోయిన నానమ్మ గుర్తొచ్చి...
తాను చేస్తున్న సాయాన్ని ప్రచారం చేసుకోవడం ఇష్టం లేని రాజు నాయక్.. ఇల్లు కట్టించే వరకు విషయం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. తోటి సిబ్బంది ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా... గొప్ప మనసు చాటుకున్న డీఐని అభినందించారు. యాదమ్మను చూస్తే చనిపోయిన తన నానమ్మ గుర్తొచ్చిందని... దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఇతరులకు సాయపడటం మన బాధ్యత అని డీఐ రాజు నాయక్ తెలిపారు.
కన్న కొడుకుల్లా....
సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో యాదమ్మతో గృహప్రవేశం చేయించారు. ఆ ఇల్లు చూసిన యాదమ్మ ఆనందానికి అవదుల్లేవు. కన్న కొడుకులా ఇల్లు నిర్మించాడని.. ఆనంద బాష్పాలతో ఆ అవ్వ రాజునాయక్కు కృతజ్ఞత చెప్పుకుంది.
అవ్వకు గొప్ప మేలు...
పదిహేనేళ్ల కిందట ఓ ప్రమాదంలో యాదమ్మ భర్త మరణించగా... పలు ఇళ్లల్లో పనిచేస్తూ చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తోంది. ఆమె పరిస్థితి చూసి చలించి ఇంటికి ఎదురుగా నివసించే కల్యాణి అనే యువతి సపర్యలు చేయటమే కాకుండా భోజన వసతులు సైతం కల్పిస్తోంది. యాదమ్మకు పోలీసులు చేసిన మేలు చాలా గొప్పదని... స్థానికులు అభినందించారు.