రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, ఐపీఎం తదితర 17 ల్యాబొరేటరీల్లో రోజుకు 8 వేల ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించే సామర్థ్యముంది. ల్యాబ్‌ల సామర్ధ్యాన్ని 17 వేలకు పెంచేలా అదనంగా అధునాతన పరికరాలను సమకూర్చనున్నారు. రాష్ట్రంలోని 23 ప్రైవేటు వైద్యకళాశాలల్లో 5వేల పరీక్షలను నిర్వహించే సామర్థ్యముంది. వీటికి ముడిసరకును ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయనుంది. ఇవి కాకుండా 33 జిల్లాల్లో కొత్త ఆర్‌టీపీసీఆర్ పరీక్షల ల్యాబ్‌లను నెలకొల్పడం ద్వారా మరో 10 వేల పరీక్షలను ఒకరోజులో చేయడానికి అవకాశాలు పెరుగుతాయి. గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ రూ.5 కోట్లతో అధునాతన తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ను నెలకొల్పడానికి ప్రభుత్వం అనుమతించింది. బీబీనగర్ ఎయిమ్స్‌లోనూ త్వరలోనే ఆర్‌టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీటిద్వారా రోజూ మరో 2వేల పరీక్షలను చేయడానికి అవకాశముంటుందని వైద్యశాఖ భావిస్తోంది.
రోజుకు కనీసం 45-50 వేల పరీక్షలు..
మొత్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రోజుకు సుమారు 34 వేలకు పైగా పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమవుతోంది. దీనికి అదనంగా ప్రస్తుతమున్న 60 ప్రైవేటు ల్యాబ్‌లను వినియోగించుకోవాలని వైద్యశాఖ నిర్ణయించింది. తద్వారా రోజుకు కనీసం 45-50 వేల ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను చేసేలా ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. యాంటీజెన్ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు సగటున 60 వేలు నిర్వహిస్తుండగా.. తాజాగా లక్ష దాటింది. ఇక నిత్యం 1.20 లక్షల యాంటీజెన్ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకనుగుణంగా ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల కిట్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది.
పని ప్రదేశాల్లో టీకాల నిర్వహణ ప్రైవేటుకు
పని ప్రదేశాల్లో టీకాల నిర్వహణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా? అని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బహుళ గృహ సముదాయాలు, వాణిజ్య సంస్థలు ఎదురుచూస్తున్నాయి. వీటిల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని ఆరోగ్యశాఖ నిర్ణయానికొచ్చింది. ప్రస్తుతం అన్ని పీహెచ్‌సీల స్థాయుల్లోనూ టీకాలను అందజేస్తున్నారు. ఇదే సమయంలో 1024 కేంద్రాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పని ప్రదేశాల్లోకి వెళ్లి వ్యాక్సిన్ వేయడం సాధ్యం కాదని ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఈ ప్రక్రియను ప్రైవేటు ఆసుపత్రులకు అప్పగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైద్యశాఖ నిర్ణయించింది.
టీకాకు రూ.250 గరిష్ఠంగా చెల్లించాలి
ఏదైనా ప్రైవేటు ఆసుపత్రితో బహుళ గృహ సముదాయాల సొసైటీ వారు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటే.. అందుకు వైద్యశాఖ అనుమతిస్తుంది. అక్కడ కనీసం 100 మందికి పైగా టీకాలు పొందాలి. ఒక్కో టీకాకు రూ.250 గరిష్ఠంగా చెల్లించాలి. ఆసుపత్రి సిబ్బంది రాకపోకల ఖర్చును లబ్ధిదారులే భరించాలి. అక్కడ తప్పనిసరిగా ఒక వైద్యుడు ఉండాలి. దుష్ఫలితాలు ఎదురైతే తక్షణ చికిత్స అందించేందుకు ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలి. అంబులెన్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పరీక్షలు: డీహెచ్