ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను(RTC EMPLOYEES) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ -PTD) ఉద్యోగులుగా గత ఏడాది జనవరి 1 న విలీనం చేయడంతో వారంతా సంబరపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు మేలు కలుగుతుందని భావించారు. అయితే ఆర్టీసీలో ఇంతకాలం ఉన్న ప్రయోజనాలను తొలగించగా, సర్వీసు నిబంధనల ఉత్తర్వులతో వేలసంఖ్యలో ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో 52 వేలమంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
పింఛనుపైనే ఆశలు..
ప్రభుత్వ ఉద్యోగులయ్యాక పింఛను వస్తుందని ఆశపడ్డారు. 2004కు ముందున్న పాత పింఛను(PENSION) విధానం అమలు కావాలని కోరుతున్నా, దీనిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకున్న సీపీఎస్ వీరికి అమలు చేయట్లేదు. ప్రభుత్వం పాత పింఛను విధానం మళ్లీ తీసుకొచ్చినా.. పీటీడీ ఉద్యోగులు గత ఏడాది జనవరిలో విలీనమైనందున వీరికి అది వర్తించదనే వాదన ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
పాత పథకం పోయింది..
ఆర్టీసీలో 1989 నుంచి సిబ్బంది పదవీవిరమణ ప్రయోజన పథకం ఉండేది. జీతం నుంచి ప్రతినెలా కొంత మొత్తం రికవరీ చేసి.. దానికి యాజమాన్య వాటా జతచేసేవారు. పదవీవిరమణ తర్వాత నెలకు రూ.3,200 వరకు నెలవారీ నగదు ప్రయోజనం ఎంసీబీ(MCB) కింద అందజేసేవారు. ఉద్యోగి మరణిస్తే, జీవిత భాగస్వామికి ఈ మొత్తం అందేది. విలీనంతో ఆ పథకాన్ని రద్దుచేశారు. ఇంతకాలం రికవరీ చేసిన మొత్తాన్ని వెనక్కి ఇస్తామని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఆర్టీసీలో పదవీ విరమణలు మొదలుకానున్నాయి. వీరికి ఎలాంటి పింఛను లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు.
ఆకస్మిక మరణానికి సాయం ఉండేది..
ఆర్టీసీలో 1980 నుంచి స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ స్కీమ్ ఉండేది. జీతం నుంచి నెలకు కొంత మొత్తం రికవరీ చేసేవారు. సర్వీసులో ఉండగా చనిపోతే(SUDDEN DEATH) కుటుంబానికి రూ.లక్షన్నర సాయంతోపాటు, అప్పటివరకు రికవరీ చేసిన మొత్తాన్ని వడ్డీతో అందించేవారు. ఒకవేళ ఉద్యోగి పదవీవిరమణ చెందితే.. వడ్డీతో అందజేస్తారు. గత ఏడాది జనవరి నుంచి ఈ పథకాన్ని నిలిపేశారు. ప్రభుత్వంలో ఏపీజీఎల్‌ఐసీ పథకాన్ని పీటీడీ ఉద్యోగులకు అమలుచేశారు. దీనికి అయిదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధనతో చాలామంది అనర్హులయ్యారు. గతంలో ఆర్టీసీ యాజమాన్యమే పూర్తిగా నిధులు వెచ్చించి వైద్యం అందించేది. పదవీవిరమణ తర్వాతా ప్రతినెలా మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఈహెచ్‌ఎస్‌లో పరిమితులతో ఇబ్బంది పడుతున్నారు.
సొమ్ముల కోసం ఎదురుచూపులు..
మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వెంటనే ప్రయోజనాలు అందటం లేదు. కొవిడ్(COVID) రెండుదశల్లో దాదాపు 295 మంది ఉద్యోగులు మరణించారు. ఇంకా, వైద్యపరమైన కారణాలతో రిటైరైనవారు, రాజీనామా చేసినవారు 150 మంది వరకు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 9 మందికే మరణానంతర, పదవీ విరమణానంతర ప్రయోజనాలు అందినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగి మరణించినా, పదవీవిరమణ చేసినా వారం నుంచి నెలలోపు గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, చివరి నెల వేతనం, ఇతర ప్రయోజనాల మొత్తం అందేవి. ఇప్పుడు నెలలు గడుస్తున్నా ఈ డబ్బులు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
పదోన్నతులు గగనమే..
ఇటీవల సర్వీసు నిబంధనలు అమలుచేస్తూ ఉత్తర్వులివ్వగా, ఇందులో పేర్కొన్న విద్యార్హతలతో వేలమంది పదోన్నతులకు(PROMOTIONS) నోచుకోని పరిస్థితి నెలకొంది.
* 1989కి ముందు చదవటం, రాయడం వస్తే డ్రైవరుగా తీసుకునేవారు. 1989 తర్వాత అయిదో తరగతి అర్హతతో తీసుకున్నారు. వీరిలో సీనియారిటీ ఆధారంగా గ్రేడ్-1 డ్రైవర్‌గా పదోన్నతి కల్పిస్తారు. ఇపుడు అదే పోస్టుకు ఎనిమిదో తరగతి, ఆపై పోస్టులకు పదోతరగతి, డిగ్రీ అర్హత ఉండాలనే నిబంధనతో వేలసంఖ్యలో డ్రైవర్లు పదోన్నతులకు దూరం కానున్నారు.
* కండక్టర్లను గతంలో పదోతరగతిలో అత్యధిక మార్కులు వచ్చినవారిని నియమించేవారు. వీరికి కంట్రోలర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్-3 (TI-3), జూనియర్ అసిస్టెంట్, టీఐ-2, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ తదుపరి పోస్టులకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతులిచ్చేవారు. ఇప్పుడు టీఐ-3 తర్వాత నుంచి పదోన్నతి పొందాలంటే డిగ్రీ ఉండాలనే నిబంధనతో చాలామంది ఒక పదోన్నతితోనే ఆగిపోనున్నారు.
* గ్యారేజీ, వర్క్‌షాపుల్లో పనిచేసే మెకానిక్‌లు, ఆర్టిజాన్స్ ఐటీఐ అర్హతతో చేరారు. వీరికి లీడింగ్ హ్యాండ్, జూనియర్ అసిస్టెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్, ఆపై పదోన్నతులు వచ్చేవి. తాజాగా లీడింగ్ హ్యాండ్‌కు మాత్రమే ఐటీఐ అర్హతతో పదోన్నతి ఇస్తారు. ఆపై పోస్టులకు డిప్లమో, ఇంజినీరింగ్ ఉండాలనే నిబంధన తెచ్చారు. మెకానిక్‌లు ఒక పదోన్నతితో ఆగిపోతున్నారు.
ఇవీ చదవండి: PRAGATHI: రేపట్నుంచే పది రోజుల పాటు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు