ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సంఘాలు, ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా, ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్పినా.. కొత్త విధానం ప్రకారం ఆస్తి పన్ను, చెత్త సేకరణపై రుసుముల భారం పట్టణ ప్రజలకు తప్పడం లేదు. దాదాపు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఈ రెండు ప్రతిపాదనలనూ ఆమోదిస్తూ ఏపీలో అధికార పార్టీ సభ్యులు తీర్మానాలు చేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలు, సవరణ తీర్మానాలు చర్చకు కూడా రావడం లేదు. గత వారం, పది రోజులుగా ఏపీవ్యాప్తంగా నిర్వహిస్తున్న పుర, నగర పాలకవర్గ ప్రత్యేక సమావేశాలన్నింటిలోనూ దాదాపుగా ఇదే తంతు. కొత్త విధానం ప్రకారం పట్టణ, నగర ప్రజలపై ఆస్తి పన్ను భారం రూ.186 కోట్లు, చెత్తపై రుసుముల భారం ఏటా రూ.240 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఏటా రూ.426 కోట్ల అదనపు భారం పడనుంది.
ఏకవాక్య తీర్మానమే..
తిరుపతిలో ఏకవాక్య తీర్మానంతో కొత్త పన్ను విధానాన్ని ఆ రాష్ట్ర అధికార పార్టీ సభ్యులు ఆమోదించారు. విజయవాడలో కొత్త విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని ప్రతిపక్ష సభ్యులు చేసిన సవరణ తీర్మానం పరిశీలనకు కూడా నోచుకోలేదు. అనంతపురంలోనూ కొత్త పన్ను విధానాన్ని పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. గుంటూరులో ఆస్తి పన్ను పెంపు 15 శాతానికి బదులుగా 13 శాతానికి పరిమితం చేయాలని పాలకవర్గం తీర్మానించింది. పాలకవర్గ తీర్మానాలతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మూల ధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూళ్లకు, త్వరలో అన్ని పుర, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో చెత్త సేకరణపై పూర్తి స్థాయిలో రుసుముల విధింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పన్నులు రూ.186 కోట్లు పెరుగుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, అసెస్‌మెంట్ల వారీగా ప్రజలకు ప్రత్యేక తాఖీదులిస్తే వాస్తవం ఏమిటో తేలుతుందని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 40 లక్షల నివాసాలు, వాణిజ్య సంస్థలు ఉన్నట్లు స్వచ్ఛాంధ్ర సంస్థ లెక్కలు వేసింది. వీటి నుంచి చెత్త సేకరణపై సగటున నెలకు రూ.50 చొప్పున వసూలు చేసినా రూ.20 కోట్లు వస్తుంది. అంటే ఏడాదికి రూ.240 కోట్లు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: CJI JUSTICE NV RAMANA: 'కృష్ణా నదీ జలాల పిటిషన్పై నేను విచారణ చేపట్టను'