హైదరాబాద్ జీడిమెట్లలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఫాక్స్ సాగర్ వరద కాలువ పొంగి పొర్లుతోంది. పక్కనే ఉన్న ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో కి నీరు రావడం వల్ల ఆ కాలనీలోకి రాకపోకలు బంద్ అయ్యాయి. వర్షాకాలం వచ్చిందంటే చుట్టుపక్కల కాలనీలన్నీ జలమయం అవుతాయని స్థానికులు వాపోయారు.
కాలనీలోకి వెళ్లే బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బ్రిడ్జి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వెళ్లాలన్నా కష్టంగా ఉంటుందని.. అధికారులు పట్టించుకోవాలని కోరారు.