గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలంలో కారు ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. అద్దంకి - నార్కట్ పల్లి రహదారిలోని తంగేడు మల్లి మేజర్‌లో కారు బోల్తా పడి నలుగురు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు. తెలంగాణ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న కారు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెం వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కాల్వలోకి బోల్తాకొట్టింది. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఘటనలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంకు చెందిన పాలోజ్ ఆనంద్, ధర్మపురికి చెందిన ఆయన బావమర్ధి కటకం మహేష్, మరో వ్యక్తి జగదీశ్ గౌడ్, ఆయన పది సంవత్సరాల కుమారుడు శివమ్ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ మాధవ్ తిమ్మాపూర్లో ఉంటూ పదిహేను సంవత్సరాలుగా మేస్త్రీ పని చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా పామూర్ కు చెందిన మాధవ్ అక్కడ తను కట్టుకున్న ఇల్లుకు రంగులు వేసేందుకు వీరుగౌడును, ఫర్నీచర్ పని చేసేందుకు ఆనంద్‌ను ధర్మపురి నుంచి తీసుకెళ్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరు జగదీశ్ గౌడ్ పది సంవత్సరాలుగా ధర్మపురిలో ఉంటూ భవనాలకు రంగులు వేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంలో బావబామ్మర్దులు, తండ్రి కుమారుడు మరణించడంతో ధర్మపురిలో విషాదం నెలకొంది.
కారు డ్రైవర్, యజమాని మాధవ్ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. మాధవ్‌కు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్.. బర్త్‌డేకి పిలిచి అత్యాచారం..