Revanth reddy Letter to CM KCR : తెలంగాణ ఆవిర్భావం నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో.. ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. హోంగార్డులు, మోడల్ స్కూళ్ల సిబ్బందికి వెంటనే జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన రేవంత్... విలువైన భూముల అమ్మకం, లక్షల కోట్ల అప్పుల ద్వారా వచ్చిన నిధులు చాలదన్నట్టు కేసీఆర్ సర్కార్ ప్రజలపై పన్నుల భారం మోపిందని విమర్శించారు.
ఒకవైపు అప్పులు, మరోవైపు భూముల అమ్మకం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, వ్యాట్, కరెంట్ ఛార్జీలు, భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బస్ ఛార్జీల పెంపు, అడ్డూ అదుపులేని మద్యం అమ్మకాలు వీటన్నింటి ద్వారా జనంపై ఎడాపెడా భారం మోపి.. వసూలు చేస్తోన్న లక్షల సొమ్ము ఎటుపోతోందని రేవంత్ ప్రశ్నించారు. ఏ బడా కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతున్నాయో తెలియని పరిస్థితి ఉందని ఆరోపించారు. విదేశీ యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం... నెల జీతం వస్తేకాని పూట గడవని హోం గార్డుల కుటుంబాల పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచించిందా అని నిలదీశారు.
జూన్ ముగియడానికి వస్తున్నా... ఇంతవరకు మే నెల జీతం ఇవ్వకపోవడమేంటని రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇప్పటివరకు రైతుబంధు నిధులు ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని కోరారు. అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.