Revanth reddy letter to cm kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ వీఆర్ఏలు గత 48 రోజులుగా సమ్మె చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆ లేఖలో వివరించారు. వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని, సొంత గ్రామాల్లో వాళ్లకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మెకాలంలో, విధి నిర్వహణలో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వీఆర్‌ఏల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించని పక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు ప్రత్యక్ష పోరాటానికి సైతం సిద్ధమవుతోందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలో వీఆర్‌ఏల పరిస్థితి నిర్బంధ కార్మికుల కంటే అధ్వానంగా తయారయిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడం తప్ప వారి హక్కులు పరిరక్షించేందుకు ప్రభుత్వం చొరవ చూపటం లేదని ధ్వజమెత్తారు. ఏళ్ల తరబడి వారికి పదోన్నతులు ఇవ్వకపోవడంతో పాటు తగినంతగ వేతనాలు ఇవ్వటం లేదని ఆరోపించారు. చాలీచాలని జీతాలతో జీవితాలను ఎంతో ఇబ్బందికరంగా వెల్లదీస్తున్న దుస్థితి వీఆర్‌ఏలకు దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీల కంటే ధీనమైన పరిస్థితిలో వీఆర్‌ఏల దుస్థితి ఉందని వాపోయారు.
రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్‌ఏలు ఉంటే.. అందులో 90 శాతం బీసీలు, దళిత వర్గాల బిడ్డలే ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు. 2020లో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో వీఆర్ఏలపై పని భారం పెరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేస్తామని 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీ సాక్షిగా సీఎం హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు అమలకు నోచుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోయిందని.. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని ఆరోపించారు.
ఇవీ చదవండి: