Revanth At Chanchalguda Jail : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న యువకులు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. వీరిని కలవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మల్లురవి, అంజన్ కుమార్ యాదవ్ చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న యువకులతో మాట్లాడ్డానికి కేవలం ఇద్దరికే అనుమతి ఇవ్వడంతో రేవంత్, మల్లురవి యువకులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. యువకులవి న్యాయమైన డిమాండ్లేనని.. వారి పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని రేవంత్ భరోసానిచ్చారు.
దేశాన్ని రక్షిస్తున్న సైనికులను గత ప్రభుత్వాలు కీలకంగా భావించాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. దేశభక్తి కలిగిన వేల మంది యువకులను సైన్యంలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. యువత గురించి కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సమాజంలో ఏ వర్గంతోనూ చర్చించకుండా కీలకమైన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
'సైనికులకు ప్రత్యేకమైన గౌరవం దక్కేలా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. కేవలం నాలుగేళ్ల కోసం యువకులను సైన్యంలోకి తీసుకోవటం సరికాదు. నాలుగేళ్లు పనిచేయించుకుని ఇంటికి పంపిస్తే తర్వాత వారి సంగతేంటి? మోదీ సర్కారు జవాన్లలో గందరగోళం సృష్టించింది. 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే ఆ జవాన్ పరిస్థితి ఏంటి?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో పోలీసులు.. ఇప్పటి వరకు 2 విడతల్లో 55 మంది యువకులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వారిలో ఇప్పటి వరకు 46 మందికి ములాఖత్ ఇచ్చారు. ఇంకా మరో 9 మందికి మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఈ 9 మందిలోనే ములాఖత్ కల్పించారు.
సికింద్రాబాద్ ఘటనకు సంబంధించిన కేసులో బాధితుల పక్షాన పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారుల తరఫున న్యాయపోరాటం చేయడానికి రెడీ అయింది. కేసులో ఉన్నవారంతా విద్యార్థులు అయినందున వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వారికి న్యాయ సాయం అందించటం కోసం గాంధీభవన్‌లో 9919931993 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.