అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యంతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్‌కే రెడ్డి తెలిపారు. తాలిబన్ గ్రూపులను పాకిస్థాన్ వాడుకుంటూ భారత్‌లో అంతర్గత తీవ్రవాదాన్ని పెంచి, జమ్మూకశ్మీర్‌లో అస్థిరతను సృష్టించే ప్రమాదముందని చెప్పారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు సృష్టిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నందున చైనా వారికి మద్దతిస్తోందని తెలిపారు. తాలిబన్లతో అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలకు మరోసారి తీవ్రవాద ముప్పు పొంచి ఉందన్నారు. అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ఏఆర్‌కే రెడ్డి ఈటీవీ భారత్‌తో మాట్లాడారు.
20 ఏళ్ల కిందట తాలిబన్ల పరిపాలనలో అఫ్గానిస్థాన్ పూర్తిగా ధ్వంసమైంది. గతంలో కశ్మీర్‌లో పట్టుబడిన తీవ్రవాద ముఠాల్లో తాలిబన్లు కూడా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాలిబన్లను వాడుకుంటూ బలూచిస్థాన్‌లో ఉద్యమాన్ని పాకిస్థాన్ కొంతకాలం అణచివేస్తుంది. తద్వారా అక్కడి సైన్యాన్ని భారత సరిహద్దులో మోహరించే అవకాశముంది. ఈ పరిస్థితి మనకు ఇబ్బందికరమే. అఫ్గానిస్థాన్‌లో 40 ఏళ్ల క్రితం మగపిల్లవాడికి పదహారేళ్లు నిండితే గుర్రం, తుపాకీ ఇచ్చి బతకమని బయటకు పంపించేవారు. రష్యా, అమెరికా, ఐరోపాల ప్రభావంతో అక్కడ స్వేచ్ఛగా, మానవహక్కులతో సంతోషంగా బతకాలన్న ఆలోచన పెరిగి సాంస్కృతిక మార్పు వచ్చింది. భారత్ చేసిన అభివృద్ధితో అక్కడి ప్రజల్లో మన దేశంపై సానుకూల వైఖరి ఉంది. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పరిస్థితి మారుతుంది. - ఏఆర్‌కే రెడ్డి, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్.
అఫ్గాన్ సైన్యం ప్రతిఘటన లేకుండా లొంగిపోవడంపై మాట్లాడుతూ.. ‘తాలిబన్లది క్రమపద్ధతి లేని యుద్ధరీతి. అఫ్గాన్ సైన్యానికి ఆయుధాలు, టెక్నాలజీ వాడటంలో అమెరికా 20 ఏళ్లుగా శిక్షణ ఇచ్చింది. సైన్యంలో చాలామంది తాలిబన్ సానుభూతిపరులు ఉన్నారు. వీరి సహకారంతోనే తాలిబన్లు వేగంగా దేశాన్ని, పరిపాలనను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు’ అని వివరించారు.
ఇదీ చూడండి: Taliban News: క్రూరత్వానికిి మారుపేరు.. ఎవరీ తాలిబన్లు?