Tdp flagpole Removal : ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెలో తెలుగుదేశం జెండా దిమ్మె తొలగింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చౌడేపల్లె బస్టాండ్ కూడలిలో ఉన్న తెలుగుదేశం జెండా దిమ్మెను అధికారులు తొలగించారు. అడ్డుకునేందుకు యత్నించిన మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వారికి, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అనంతరం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు పుంగనూరు నియోజకవర్గ బాధ్యుడు చల్లా రామచంద్రారెడ్డి చౌడేపల్లి బయల్దేరగా మార్గమధ్యంలో రొంపిచర్యల కూడలి వద్ద ఆయనతో పాటు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహించిన కార్యకర్తలు రహదారిపై బైఠాయించగా.. మరోసారి పోలీసులు, తెలుగుదేశం శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక వైకాపా నేతలు కావాలనే తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేయడంతో పాటు.. పోలీసుల అండతో కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చల్లా రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు వైకాపాలో చేరిపోయారు...
చిత్తూరు జిల్లా చౌడేపల్లి ఘటనపై స్పందించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... రాష్ట్రంలో కొంతమంది పోలీసులు అధికారికంగా వైకాపాలో చేరిపోయారని మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి మెప్పుకోసం పోలీసులే తెలుగుదేశం నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్యాయమని నిలదీసిన తెదేపా నేత రామచంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: